- టీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయం
- రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన
- బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు
సామాజికసారథి, మెదక్: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వరి పంట వేయొద్దని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. వానాకాలం పంటలో రా రైస్ మాత్రమే ఉంటుందన్నారు. బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వర్షాకాలం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వచ్చే పంటపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల ఉసురుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోకతప్పదన్నారు. టీఆర్ఎస్ మొసలి కన్నీటిని రైతులు నమ్మొద్దన్నారు. రైతాంగానికి బీజేపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఈటల పేర్కొన్నారు. రవి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50వేలను అందజేశారు.