Breaking News

విస్తృతంగా డ్రంకెన్​డ్రైవ్‌

విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్‌
  • నేడు హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • మూడు కమిషనరేట్ల పరిధిలో ఫ్లై ఓవర్ల మూసివేత
  • మద్యం తాగి పట్టుబడితే వాహనాలు సీజ్​

సామాజికసారథి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరంలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్ల పరిధిలో ఇవి అమల్లో ఉంటాయని ప్రకటించారు. డిసెంబర్‌ 31 రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్‌లోని సైబర్‌ టవర్స్‌ ఫ్లై ఓవర్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్‌ స్పేస్‌, ఫోరంమాల్‌, రోడ్‌ నెంబర్‌ 45, దుర్గం చెరువు బ్రిడ్జ్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌, బేగంపేట్‌, ప్యారడైజ్‌, నారాయణగూడ, బషీర్‌ బాగ్‌, ఎల్బీనగర్‌, మలక్‌ పేట్‌, నెక్లెస్​రోడ్‌, మెహదీపట్నం, పంజాగుట్ట ప్లైఓవర్లు మూసివేయనున్నారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వే పైకి అనుమతించనున్నారు. కేవలం లారీలు, గూడ్స్‌ వాహనాలుకు మాత్రమే పర్మిషన్‌ ఇవ్వనున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా క్యాబ్‌ డ్రైవర్లకు పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రైవర్లు క్యాబ్‌ సర్వీసును రద్దు చేస్తే మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ సెక్షన్‌ 178 ప్రకారం రూ.500 పెనాల్టీ విధిస్తామని ప్రకటించారు. కస్టమర్ల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం రాత్రి విస్తృతంగా డ్రంకెన్​డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. మద్యం తాగి పట్టుబడిన వారికి మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 1988లోని సెక్షన్‌ 185 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు జరిమానా విధిస్తామని చెప్పారు.