- రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు
- మధ్య దళారులుగా అధికారులు, సింగిల్‌విండో చైర్మన్లు
- ప్రజాప్రతినిధుల మాటలను వినిపించుకోని వైనం
- క్వింటాలుపై 10కిలోల మేర భోజ్యం
- ఓ రైతుకు 18 క్వింటాళ్ల తరుగు.. రూ.36వేల నష్టం
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నల పంట చివరకు మిల్లర్లు, అధికారులకు కాసులవర్షం కురుస్తోంది. అన్నదాతలకు మాత్రం కష్టమే మిగులుతోంది.పేరుకు మాత్రం పైకి రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాల్సిన సమయంలో నిలువునా ముంచుతున్నారు. జిల్లాలో జరుగుతున్న వారి కొనుగోళ్లలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ఒక పక్క రైతులు మరోపక్క ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో గగ్గోలు పెడుతున్నా అప్పటికి అధికార పక్ష నాయకులు మాత్రం తమ లాభాలను చూసుకుని రైతులను నిండా ముంచుతున్నారు. రైతు తమ పంటలను పండించడం ఒక వంతు. వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు పడాల్సిన కష్టాలు ఒక వంతుగా మారుతున్నాయి. మార్కెట్‌కు తన ధాన్యాన్ని తీసుకెళ్తే అక్కడ ఎంత రేటు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా రైతుల ధాన్యాన్ని కొంటున్నారు. అయితే ఇక్కడ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు జరుగుతోంది. రైతులకు అండగా నిలవాల్సిన వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల నాయకులు, అధికారులు రైతులను మిల్లర్లతో కుమ్మక్కై ముంచుతున్నారు. వరి ధాన్యంలో తేమశాతం 14 కంటే తక్కువగా ఉంటే సదరు రైతు నుంచి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా తరుగు తీయకుండా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ అందులో తాలు, తేమశాతం ఎక్కువగా ఉందని సాకులు చూపుతూ ఒక్కో క్వింటాలుపై దాదాపు 10కిలోలకు పైగా తరుగు తీస్తూ ధాన్యాన్ని కొంటున్నారు. ఆ తర్వాత తీసిన ధాన్యాన్ని మిల్లర్లు సహకార సంఘాల నాయకులు అధికారులు కలిసి మొత్తం కొనుగోలు ముగిశాక వచ్చిన వడ్లను తమకు తెలిసిన రైతుల పేర్ల మీద రాసుకుని డబ్బులు డ్రా చేసుకుంటూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో జిల్లాస్థాయి అధికారులు, నాయకుల నుంచి గ్రామస్థాయి అధికారులు వరకు ఎంతోకొంత ముట్టజెప్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ధాన్యంలో తరుగు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించిన రైతుల వడ్లను కొనకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
18 క్వింటాళ్ల తరుగు
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన రైతు బొగ్గు రాజు తనకున్న పొలాన్ని కాకుండా గ్రామంలో ఇద్దరు వ్యక్తుల నుంచి కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. అతనికి వర్షాకాలానికి సంబంధించి 194 క్వింటాళ్ల వరి ధాన్యం చేతికొచ్చింది. తన గ్రామంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రంలో వడ్లను అమ్మేశాడు. అయితే ఆ రోజు రాత్రి ఆ కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ అతనికి మొత్తం 194 క్వింటాళ్ల వరి అమ్మినట్లు రిసిప్ట్ ఇచ్చేశాడు. కానీ మరుసటి రోజు అతను వాటిని మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత ఆ కేంద్ర ఇన్చార్జ్వచ్చి 18 క్వింటాళ్ల తరుగు వచ్చిందని మరొక రిసిప్ట్ ఇచ్చాడు. దీంతో అతను తన వడ్లు తనకు కావాలని ప్రైవేట్వ్యాపారులకైనా అమ్ముకుంటామని, అసలే వరి ధాన్యం దిగుబడి తక్కువగా వచ్చిందని అతను చెప్పాడు. కానీ వరి కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ మిల్లర్లు ఇద్దరు కుమ్మకై అతనికి ధాన్యం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో సదరు రైతు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. దీంతో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారికి నివేదించినప్పటికీ అతనికి మిల్లర్ల నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. 18 క్వింటాళ్ల తరుగు కచ్చితంగా తీసుకుంటామని వారు అతని హెచ్చరించి పంపించేశారు. దీంతో తన కష్టం రూ.36వేలు మిల్లర్లు, అధికారుల పాలవుతుందని కన్నీరుమున్నీరయ్యాడు. జిల్లావ్యాప్తంగా మిల్లర్లు అధికారులు రైతులను ఎంత మోసానికి గురిచేస్తున్నారో తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు ఒక ఎమ్మెల్సీ జిల్లా అధికారికి విన్నవించుకున్నా తనకు న్యాయం జరగలేదని వడ్ల కొనుగోళ్లలో దళారుల దందా నడుస్తోందని ఆవేదన వ్యక్తంచేశాడు.