Breaking News

దేవుడు వరమిచ్చినా… పూజారీ కరుణించలే…!

√ మంత్రి సానుకూలంగా ఉన్నా యూనియన్ నాయకుల ఇష్టారాజ్యం
√ సోషల్ మీడియా లో హల్ చల్ చేసే వారికి ప్లాట్ల పట్టాలు అందజేత
√ అసలైన జర్నలిస్టులకు, దళిత జర్నలిస్టులకు మొండి చెయ్యి
√ వనపర్తి లో అస్తవ్యస్థంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనట్లుగా సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించినా మంత్రి కార్యాలయం సిబ్బంది, యూనియన్ నాయకులు కరుణించకపోవడంతో వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణి అస్తవ్యస్థంగా మారింది. మంత్రి నిరంజన్ రెడ్డి మానవత్వంతో జిల్లాలోని అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు అందించేందుకు సిద్దంగా ఉన్నా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, మంత్రి పీఆర్వో సందీప్ రెడ్డి చేసిన అడ్డగోలు జాబీతాలతో అసలైన వర్కింగ్ జర్నలిస్టులకు , దళిత జర్నలిస్టులకు న్యాయం జరగడం లేదు.
జర్నలిస్ట్ యూనియన్ల పేరుతో ఎన్నో ఏళ్లుగా తోటి జర్నలిస్టులను తమ అవసరాలకు వాడుకుంటూ, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో తమ బలం, బలగం చాలా ఉందంటూ తమ పనులను చక్కబెట్టుకొని నాయకులుగా చలామణీ అవుతున్న జర్నలిస్ట్ యూనియన్ పెద్దల బాగోతం ఇళ్ల స్థలాల పంపిణితో బయటికి వచ్చింది. జిల్లాలో మూడు జర్నలిస్ట్ యూనియన్ల పేరుతో తోటి జర్నలిస్టులను మభ్య పెట్టి తమకు మాత్రం మంచి అనుకూలంగా ఉన్న శ్రీనివాసాపూర్ గ్రామ శివారులో కోరుకున్న ఇళ్ల స్థలాల పట్టాలను తీసుకొని వెలకట్టలేని మోసం చేశారని తోటి జర్నలిస్టులు దుమ్మెత్తి పోస్తున్నారు.
రాజకీయ నాయకులను మించిన జర్నలిస్ట్ నాయకులు…వనపర్తి జిల్లాలో జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల పంపిణిలో తమకు నచ్చిన వారికి, ఇదివరకే జర్నలిస్ట్ కోటాలో ఇళ్ల స్థలాలు పొందిన వారికి, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, పైరవీలు చేసేవారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంపై దుమారం ఇంకా చల్లారడం లేదు. పైగా మూడు సంఘాల జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఇళ్ల స్థలాల పట్టాల జాబీతాలను తయారు చేసి మంత్రి పీఆర్వో సందీప్ రెడ్డి ద్వారా ఓకే చేయించి పట్టాలు పొందినా ఇప్పుడు మాత్రం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వనపర్తి లో మొదట పీర్లగుట్ట పై ఇదివరకే నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రి నిర్ణయించినా కొందరు జర్నలిస్టులు దానిని పక్కకు పెట్టి శ్రీనివాసాపూర్ గ్రామ శివారులో ఎంతో అనువుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ స్థలం ఇప్పటికిప్పుడు ఇండ్లు నిర్మించుకునేందుకు అనుకూలంగా ఉండడంతో జర్నలిస్ట్ సంఘాల నాయకులు మొదటి విడతలో తమకు ఇక్కడ ఇళ్ల స్థలాలు పొంది ఆ తర్వాత ఇతర జర్నలిస్టులను పీర్లగుట్ట పైకి, లేదా, చిట్యాల రోడ్, ఇలా పట్టణానికి దూరంగా ఉన్న ఇతర స్థలాలవైపు మళ్లించేందుకు వేసిన స్కెచ్ పక్కా సక్సెక్ చేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. శ్రీనివాసా పూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ స్థలం లో ఏర్పాటు చేసిన 80 కి పైగా ప్లాట్లను జర్నలిస్ట్ సంఘాల పెద్దలు తమతో పాటు తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించుకొని అసలైన , అర్హులైన అనేక మంది సీనియర్ జర్నలిస్టులను, దళిత జర్నలిస్టులను పక్కన పెట్టారు. పైగా ఇక్కడ కెటాయించిన ప్లాట్లలో కూడా కొందరికి వారి పేరిట ఉన్న ప్లాట్లను కూడా అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన వారికి ,ఈ అన్యాయంపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించిన వారికి కేటాయించి మరో కొత్త గందరగోళానికి తెరతీశారు. తమ పేరిట కేటాయించిన ప్లాట్ల నెంబర్లను ఇతరులకు కేటాయించినా అడిగేందుకు జర్నలిస్ట్ సంఘం నాయకులు గాని మంత్రి కార్యాలయం సిబ్బంది కాని ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా కొందరు జర్నలిస్ట్ సంఘం నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని, మరికొందరు తమకు కెటాయించిన ప్లాట్ పట్టాను ఇతర జర్నలిస్ట్ కు ఇస్తామని రాజకీయ నాయకులను మించి దిద్దుబాటు చర్యలకు దిగడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ఇళ్ల పట్టాల జాబీతాలు తయారు చేసినప్పుడు అన్ని యూనియన్ల నాయకులు ఉన్నా ఆ తర్వాత జరిగిన అవకవతకలను ప్రశ్నించకుండా కేవలం తమపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు జర్నలిస్టు సంఘాల నాయకులు ఆడుతున్న డ్రామాలుగా తోటి జర్నలిస్టులు కొట్టి పడేస్తున్నారు. సంఘాల పేరుతో కోరుకున్న ఇంటి స్థలాల పట్టాలను తీసుకొని ఇప్పుడు తోటి జర్నలిస్టులకు న్యాయం చేయకుండా డ్రామాలు ఆఢడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ నెపంతో నెల రోజులు ఇళ్ల పట్టాల ఇష్యూను డైవర్ట్ చేస్తే ఆ తర్వాత తమను అడిగేవారు ఉండరని జర్నలిస్టుల సంఘాల నాయకులు తోటి జర్నలిస్టులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటి కైనా మంత్రి నిరంజన్ రెడ్డి చొరవ తీసుకొని అర్హత గల అందరి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణి చేయాలని కోరుతున్నారు. జర్నలిస్ట్ సంఘాల నాయకులు చేసిన పనులకు మాకు శిక్ష వేయవద్దని వనపర్తి జిల్లా జర్నలిస్టులు వేడుకుంటున్నారు.