Breaking News

చట్టాల రద్దుపై సందేహాలు

చట్టాల రద్దుపై సందేహాలు
  • ‘మద్దతు’ దక్కేదాకా పోరాటం
  • బీజేపీకి ఓటు వేయొద్దు
  • టీఆర్ఎస్​వైఖరి సరిగ్గా లేదు
  • తెలంగాణ రైతులను ఆదుకోవాలి
  • ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల ధర్నా
  • కిసాన్‌ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌

సామాజిక సారథి, హైదరాబాద్‌ ప్రతినిధి: ప్రతి పంటకు కనీస మద్దతుధర కల్పించేలా చట్టం తేవాలని కిసాన్‌ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్‌ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటు వేయొద్దని, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఆ పార్టీని నమ్మకూడదని కోరారు. బీజేపీకి టీఆర్‌ఎస్‌ బీ పార్టీ అని సంచలన విమర్శలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్‌ఎస్‌ను ఢిల్లీకి పంపించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ లోని ఇందిరాపార్కు వద్ద ఆలిండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో గురువారం రైతులు, రైతు సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కిసాన్‌ సంయుక్త మోర్చానేత రాకేశ్‌ టికాయత్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టికాయత్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలుచేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదన్నారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.మూడు లక్షల సాయం ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాలు ముందుకొచ్చి రైతులకు అండగా విజ్ఞప్తిచేశారు.

ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి

విద్యుత్‌ సవరణ బిల్లు రద్దుపై ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని టికాయత్​డిమాండ్​చేశారు. విత్తనబిల్లు తేకుండా ప్రైవేట్​కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళ్తామన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భాష వేరైనా మన భావన ఒక్కటేనని అన్నారు. ఢిల్లీలో ఏడాది పాటు ఉద్యమం కొనసాగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సాగుచట్టాల రద్దుపై తమకు సందేహాలు ఉన్నాయని టికాయత్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ప్రజల ప్రభుత్వం కాదని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో మోడీ సర్కార్‌ కొనసాగుతోందన్నారు. అదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోంది. కార్పొరేట్ల లబ్ధికి ప్రభుత్వం తాపత్రయపడుతోందని టికాయత్‌ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో రైతుల సంఘాల నేతలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.