Breaking News

డాలర్‌ శేషాద్రి కన్నుమూత

డాలర్‌ శేషాద్రి కన్నుమూత
  • కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం
  • సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
  • స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్​ఎన్వీ రమణ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్​ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన సేవలు తప్పనిసరి కావడంతో టీటీడీ ఆయనను ఓఎస్డీగా కొనసాగిస్తున్నది. డాలర్‌ శేషాద్రి మరణం తీరని లోటని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి అని కొనియాడారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పనిచేశారన్నారు. లర్‌ శేషాద్రి హఠాన్మరణం పట్ల టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబసభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్‌ శేషాద్రి మృతికి భారత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. స్వామి సేవలో జీవితం అంకితంచేసిన మహానుభావుడని కొనియాడారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి తన తుది శ్వాస వరకు స్వామి వారి సేవలో తరించారని, టీటీడీలో ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు. డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం హృదయాన్ని కలచివేసిందని విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.  మంగళవారం తిరుపతి గోవిందధామంలో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు.