- శివుడు అభిషేక ప్రియుడు
- జాగరణం శివరాత్రి ప్రత్యేకత
- ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి
శ్రీశైలం: శివుడు అభిషేకప్రియుడే గాకుండా.. బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి రోజున విధిగా చేస్తుంటారు. పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడం చేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. త్రిమూర్తుల్లో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. మహాశివరాత్రి వ్రతాచరణను గురించి లింగపురాణం పేర్కొంటోంది. వ్రత ఉద్యాపన గురించి స్కందపురాణంలో వివరంగా ఉంది. శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తర్వాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోంది.
శివరాత్రులకు ప్రత్యేకత
నిత్యశివరాత్రి, పక్షశివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి, నిత్యశివరాత్రి అంటే ప్రతిరోజూ రాత్రిపూట చేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి 15 రోజుల కొకసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి. మాసశివరాత్రి అంటే ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రి. మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా కుదరకపోయినా ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రి నాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్లు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగం మీద పెడితే భోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.
మొక్కితే వరమిచ్చే శివయ్య
శివరాత్రి నాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాల్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాముల్లో నాలుగు సార్లు నాలుగు రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. మొదటి జాములో పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి పెసర పప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపుతారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసీ దళార్చన చేసి, పాయసం నైవేద్యంపెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు. మూడో జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, నువ్వుల పొడి కలిపిన తిను బండారాలను నివేదిస్తారు. సామవేద మంత్ర పఠనచేస్తారు. నాలుగో జాములో తేనెతో అభిషేకం చేసి నల్ల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అదర్వణవేద మంత్రాలను చదువుతారు. ఇలా అభిషేకాలు చేసే శక్తిలేనివారు అభిషేకం చేసేటప్పుడు శివదర్శనం చేసుకున్నా పుణ్యమే అంటారు. నాలుగో జాము ముగిశాక ఉదయం పూట శివుడిని ఊరేగిస్తారు. ఇలా ఊరేగించడం వెనక ఓ సామాజిక అంతరార్థం ఉంది. అందుకే భక్తులు శివరాత్రి రోజు అభిషేకం చేసి జాగారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శివుడు మిగతా దేవతలతో పోలిస్తే సులువగా అనుగ్రహం ఇస్తాడని నమ్మకం. శివనామస్మరణంతో సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే మన దేశంలో అనేక శైవాలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.