Breaking News

ఫొటోలు డిలిట్ చేస్తే చంపేస్తారా?

ఫొటోలు డిలిట్ చేస్తే చంపేస్తారా?
  • కడ్తాల్‌లో యువకుల హత్య దారుణం
  • ‘దేశం కోసం ధర్మం కోసం’అంటూ ఇదే నేర్పిస్తున్నారా?
  • బాధిత కుటుంబాలను పరామర్శించిన BRS నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

సామాజికసారథి, రంగారెడ్డి: ఇటీవల దారుణహత్యకు గురైన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషిగారి శివగౌడ్(24), గుండెమోని శివగౌడ్(29) కుటుంబసభ్యులను BRS నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. ఆయనను చూడగానే ఆ యువకుల తల్లిదండ్రులు ఘొల్లున ఏడ్చారు. వారిని ఆర్ఎస్పీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపులో ఫొటోలను డిలిట్ చేశారని ఇద్దరు యువకులను కిరాతకంగా చంపడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కడ్తాల, తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలను చూడలేదన్నారు. యువకుల హత్యోదంతంలో నయీం ముఠా సభ్యుల హస్తం ఉందని గ్రామస్తులు చెబుతున్నారని, పోలీసులు ఆ వైపు దర్యాప్తు చేయాలని కోరారు. పది నిముషాలు సరదాగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి, పక్కా ప్లాన్ ప్రకారం పదునైన కత్తులతో దాడి చేసి ఇద్దరు అమాయకులను హతమార్చడం దారుణమన్నారు. ‘దేశం కోసం ధర్మం కోసం అంటూ రోజూ బాకా ఊదుకుంటూ యువతకు మీరు నేర్పింది హత్యారాజకీయాలేనా? ఆచారి గారు?’ అంటూ ప్రశ్నించారు. ‘ఇది ముమ్మాటికీ యాదృచ్ఛికంగా జరిగిన హత్య కాదు..మేం చెప్పినట్లు చేయకపోతే మిమ్ముల చంపి చెట్లకు వేలాడదీస్తాం జాగ్రత్త’ అని వార్నింగ్ ఇవ్వడం కోసం చేసిన పాశవిక హత్య అని అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ పేద కుటుంబాల్లో చేతికొచ్చిన కొడుకులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. శేషిగారి శివగౌడ్, గుండెమోని శివగౌడ్ కుటుంబాలను ఆదుకోవాలని, ఏదైనా ప్రభుత్వ పథకంలో చేర్చి సాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన వారిలో తలకొండపల్లి జెడ్పీటీసీ, మిషన్ భగీరథ ఛైర్మన్ వైస్ ఉప్పల వెంకటేశ్ గుప్తా, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.