- విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే ఓకే
- పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చూడండి
- కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించండి
- అధికారులతో సీఎస్‌సోమేశ్‌కుమార్
సామాజిక సారథి, హైదరాబాద్: పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునేవారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని చెప్పారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా అగ్రికల్చర్, సివిల్‌సప్లయీస్ అధికారులతో శనివారం ఆయన డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, సంబంధిత అంశాలపై చర్చించారు.
పారాబాయిల్డ్ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో యాసంగిలో సాగయ్యే వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలమని చెప్పారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లు, సీనియర్ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా కలెక్టర్లు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలంలో కేవలం 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం తెలిపిందని, ధాన్యాన్ని బియ్యంగా మార్చి పంపిస్తేనే కొనుగోళ్లకు సరిపడా స్థలం ఉంటుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.