- పొరపాటు చేయకండి: జూనియర్ ఎన్టీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడిపినప్పటికీ ఇతరులు చేసిన పొరపాట్ల కారణంగా తన తండ్రి నందమూరి హరికృష్ణ, అన్న జానకీరామ్‌లను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడపం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ పోలీసు విభాగం వార్షిక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడతూ.. ట్రాఫిక్ నియమాలు, ఉల్లంఘనలతో శిక్షలు, మనుషుల నిర్లక్ష్యపు ప్రవర్తనను మార్చలేమని, ప్రతిఒక్కరూ తమకు తాము నియమాలు విధించుకుని మారాలని హితవు పలికారు. వాహనాలు నడిపే సమయంలో తమ కోసం ఇంటివద్ద ఎదురుచూసే కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపేదే పోలీసు వ్యవస్థ అని, పోలీసులను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలన్నారు. అంతకుముందు ట్రాఫిక్ లో ఉన్న ఒడిదుడుకుల గురించి సీపీ సజ్జనార్ వివరించారు. కోవిడ్ 19లో ఎంతోమంది పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కోవిడ్ వారియర్స్ గా పనిచేశారని, ఎంతోమంది ప్రాణాలు అడ్డంపెట్టి ప్లాస్మాదానం చేశారని గుర్తుచేశారు.