- బిజినపల్లి మండలంలో తవ్వేకొద్ది వెలుగులోకి సీసీ అవినీతి బాగోతంఎస్సీ,
- ఎస్టీ సబ్ ప్లాన్ రుణాలు బీసీ ఖాతాల్లోకి మళ్లించి స్వాహా
- సామాజిక సారథి కథనంతో బకాయిల చెల్లింపు షురూ
- సమగ్ర విచారణ చేస్తే కోట్ల రూపాయల కుంభకోణం
- మొక్కుబడి విచారణతో అవినీతి సీసీ కి అండగా నిలుస్తున్న అధికారులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజిన పల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల పై సామాజిక సారథి ప్రచురించిన కథనం అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ విషయంలో అధికారుల నామమాత్రపు విచారణతోనే బిజినపల్లి సీసీ కమల అవినీతి డొంక కదులుతోంది. అధికారులు ఇంకా సమగ్ర విచారణ చేస్తే రూ.కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాని ఈ అవినీతి దందా లో గ్రామ స్థాయి నుంఛి జిల్లా స్థాయి వరకు కొందరి అధికారుల పాత్ర ఉండడంతో అవీనితి, అక్రమాలను వెలుగులోకి రానివ్వకుండా దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు గ్రామాల పరిధిలో పనిచేసే ఒక్క సీసీ రూ. లక్షల అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉందంటే జిల్లాలోని అన్ని మండలాల్లో సీసీ ల అవినీతి దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఈ ఇష్యూ పై ప్రత్యేక దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరిపి తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రుణాలు, స్త్రీ నిధి రుణాల చెల్లింపు, జమ లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తవ్వే కొద్ది పెరుగుతున్న అవినీతి లీలలు…బిజినపల్లి మండలం లో పనిచేస్తున్న సీసీ కమల అవినీతి లీలలు తవ్వేకొద్ది వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో గ్రామీణ ప్రాంత నిరుపేద మహిళలు రెగ్యులర్ గా అప్పలు చెల్లిస్తున్నా సీసీ కమల మాత్రం ఆ డబ్బులను బ్యాంక్ లో జమ చేయకుండా తన స్వంత అవసరాలకు వాడుకోని వడ్డీ వ్యాపారం నిర్వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్త్రీ నిధి రుణాలతో పాటు బిజినపల్లి మండలంలో ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సీన సబ్ ప్లాన్ రుణాలను దర్జాగా బీసీ కులస్థులకు మంజూరు చేయించి వారి వద్ద నుంచి డబ్బులు డ్రా చేయించి అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. 2016-2017 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలకు రూ.6 లక్షలు లోను మంజూరు అయితే మూడు నెలలు అకౌంట్లోనే దాచిన తర్వాత రూల్స్ కు విరుద్దంగా బీసీ లకు ఇచ్చింది. తేది 17.5.2017 న వెంకటమ్మకు రూ. 1.5 లక్షలు తేది 6.6.2017 న బి చంద్రకళ కు రూ.1.5 లక్షలు, తేది 07.06.2017 న డి పద్మ కు 50 వేలు చొప్పున డ్రా చేసింది. తేది 14.06.2017 న మహిళలకు ఇవ్వాల్సీన లోన్ లను మగవారి పేరు మీద పి శేఖర్ పేరు మీద 50 వేలు, డ్రా చేసింది. అంతేకాకుంఢా తేది 11.07.2023 సొంతంగా రూ 75 వేలు డ్రా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ లకు ఇవ్వాల్సీన రుణాలను దర్జాగా బీసీ ల పేరుతో స్వాహా చేస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టింఛుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సాధారణ ఉద్యోగి గా పనిచేసే సీసీ కమల ఈ లెవల్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా పై స్థాయి అధికారులు నిజంగా పట్టించుకోలేదా లేదా వారి వంతు కమీషన్ తీసుకొని ఈ అవినీతి అక్రమాలకు సహకరించారా అన్నది నిగ్గు తేలాల్సీ ఉంది.
అధికారుల అండతో దిద్దుబాటు చర్యలు…స్త్రీ నిధి లోన్ డబ్బులు స్వాహా చేస్తున్న విషయం పై సామాజిక సారథిలో ఈ నెల 9న కథనం ప్రచురితం కావడంతో అవినీతికి పాల్పడిని సీసీ కమల అధికారుల అండతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ ఇష్యూ పై విచారణ చేసేందుకు వచ్చిన అధికారుల సూచనల మేరకు మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంక్ లో చెల్లించని సంఘాల బకాయిలను చెల్లించడం షురూ చేసింది. ఎంక్వైరీ లో వాటిని బ్యాంక్ లో చెల్లించినట్లు రసీదులు చూయించి తన తప్పును పక్కదారి పట్టించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు సమాచారం. బిజినపల్లి గ్రామైఖ్య సంఘం 1, రూ 13,51, 740, బిజినపల్లి గ్రామైఖ్య సంఘం 2, రూ. 8,38, 293, బిజినపల్లి గ్రామైఖ్య సంఘం 3, రూ.9,10, 724, పోలేపల్లి గ్రామైఖ్య సంఘం రూ. 32, 042, మహదేవుని పేట గ్రామైఖ్య సంఘం లో రూ.10,28, 163 ల చొప్పున మొత్తం రూ. 41 లక్షల 60 వేల 962 రూపాయలు స్త్రీనిధి రుణాలు బకాయిలు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సంఘాల మహిళలు రెగ్యులర్ గా లోన్ డబ్బులను సీసీ కమలకు చెల్లించినా వాటిని బ్యాంక్ లో చెల్లించకుండా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇలా సీసీ కమల లక్షల రూపాయలను పక్కదారి పట్టించినా కొందరు అధికారులు తమ అవినీతి బాగోతం కూడా బయటపడుతుందనే భయంతో అక్రమాలను వెలుగులోకి రానివ్వకుంఢా మొక్కుబడి విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క బిజినపల్లి మండలంలోనే లక్షల రూపాయల అవీనీతి, అక్రమాలు జరిగినట్లు తెలుస్తుండగా జిల్లాలోని 20 మండలాల్లో భయటికి రాని అవినీతి అక్రమాలు కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాగర్ కర్నూల్ జిల్లాలో స్త్రీనిధి రుణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రుణాలు తదితర పథకాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో తనిఖీలు నిర్వహించాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.