Breaking News

రైతు ఖాతాలలో డబ్బు జమ

రైతు ఖాతాలలో డబ్బు జమ
  • 80శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
  • కలెక్టర్ హనుమంతరావు

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  జిల్లాలో ధాన్యం కొనుగోలు  సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం అందోల్ మండలం సంగుపేట, చౌటకూర్ మండలం ఉప్పరిగూడ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు పడుతున్నాయని పేర్కొన్నారు. సమయానికి రైతులకు డబ్బులు అందడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. అధికారులు మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు అందరూ ప్రతి రైతుకు యాసంగిలో వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు.

రైతులతో కలెక్టర్ ముచ్చట్లు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు ఎక్కడ ఉన్న రైతులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు పంటల సాగు తీరుపై ఆరా తీశారు. చౌటకూర్ మండలం ఉప్పరగూడకు చెందిన రైతు జైపాల్ రెడ్డితో కలెక్టర్ హనుమంతరావు మాట్లాడగా, అందుకు రైతు జైపాల్ రెడ్డి  కలెక్టర్ కు ఇలా వివరించారు. రైతులు యాసంగిలో వరి వేయబోమని నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటామని తెలిపారు. తిండి గింజల వరకు మాత్రమే వేసుకున్నట్టు కలెక్టర్ హనుమంతరావుకు వివరించారు. కాగా, అందోలు మండలం సంగుపేట  కొనుగోలు కేంద్రంలో ధాన్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నరసింహారావుతో పాటు వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, తాసిల్దార్లు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.