Breaking News

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ బాధితులకు చికిత్స వెంటనే ప్రారంభించాలని కోరారు. జిల్లాలో ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత లేకుండా గట్టిగా కృషిచేస్తున్నామన్నారు. కొవిడ్ బాధితులు అందరికీ చికిత్స అందేలా చూసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు ఫ్రీగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యచికిత్సలు అందేలా చూడాలన్నారు. రోగులకు బలవర్ధకమైన ఆహారం సకాలంలో అందించాలన్నారు. త్వరలోనే సిద్దిపేట జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రులను తనిఖీచేస్తానని మంత్రి తెలిపారు.