Breaking News

నేరస్తుల గడ్డ.. క్రీడాకారులకు అడ్డా

నేరస్తుల గడ్డ.. క్రీడాకారులకు అడ్డా
  • ప్రధాని నరేంద్రమోడీ సెటైర్​
  • యూపీలో స్పోర్ట్స్​యూనివర్సిటీకి శంకుస్థాపన

మీరట్‌: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్‌ ఖేల్‌’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్​ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్‌ జైల్‌’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 ఎకరాల్లో యూనివర్సిటీని నిర్మించనున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి మేజర్​ధ్యాన్​చంద్ పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీతో పాటు సింథటిక్‌ హాకీ గ్రౌండ్‌తో సహా ఆధునిక, అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో లాన్‌ టెన్నీస్‌ కోర్ట్‌, జిమ్నాజియం హాల్‌, సింథటిక్‌ రన్నింగ్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ పూల్‌, మల్టీ పర్పస్‌ హాల్‌, సైక్లింగ్‌ వెల్‌డ్రోమ్‌లను కూడా నిర్మించనున్నారు. వీటితో పాటు షూటింగ్‌, స్క్వాష్‌, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆర్చరీ, కానోయింగ్‌, కయాకింగ్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. 540 మహిళలు, 540 పురుషులు సహా 1,080 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వగలిగే సామర్థ్యంతో ఈ వర్సిటీని నిర్మించనున్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ ఆగుర్ నాథ్​ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే జ్ఞాషాహిద్‌ స్మారక్‌ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య పోరాట మ్యూజియాన్ని సందర్శించారు. ఆయన వెంట ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఉన్నారు.