- ఆర్వో, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్
- సిబ్బందికి అవగాహన సదస్సు
- ఈనెల 14 ఉదయం నుంచే లెక్కింపు
- రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగానే జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ పీజే పాటిల్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య (డిఆర్డీఏ) భవనంలో కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల 14న ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6:30 కల్లా కౌంటింగ్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. లేనిచో కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన కొవిడ్ పరీక్షా కేంద్రంలో పరీక్షించి, నెగెటివ్ ఉన్నవారినే లోనికి అనుమతిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారని, కాబట్టి కౌంటింగ్ లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్ కోసం నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కిస్తామని అన్నారు. అనంతరం మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావలసిన కోటాను నిర్ధారిస్తామని అన్నారు. ఎవరైనా అభ్యర్ది కోటాకు సరిపడు ఓట్లను సాధించినట్లయితే అతనిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తామని, ఏ అభ్యర్థికీ కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే తదుపరి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతామని పేర్కొన్నారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, నల్లగొండ మండల తహసీల్దార్ మందడి నాగార్జున్ రెడ్డి, ఎన్నికల డీటీ విజయ్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.