Breaking News

పల్లె కవికి పట్టాభిషేకం

పల్లె కవికి పట్టాభిషేకం
  • గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం
  • ప్రజాకవికి కేంద్రసాహిత్య పురస్కారం

సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయరచనకు ఈ అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వవిభాగంలో వెంకన్నకు కేంద్రసాహిత్య అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసాపత్రంతో పాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం ఆనవాయితీ వస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన గోరెటి వెంకన్నకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 2019లో ‘కబీర్‌ సమ్మాన్‌’ పురస్కారం ప్రదానం చేసింది. జానపద పాటలతో ప్రజలను ఎంతో ఆకట్టుకునే వెంకన్న.. మా టీవీలో ప్రసారమైన ‘రేలా రె రేలా’ కార్యక్రమానికి సుద్దాల అశోక్‌ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఎల్లలు దాటిన వెంకన్న పాటలు
గోరటి వెంకన్న 1963లో నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారంలో జన్మించారు. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తిపాటలు పాడేవారు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళహారతులూ మొదలైన పాటలు పాడుతుండేవారు. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊరులో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చారు. వాటిలోని పాటలను ఆయన అలవోకగా పాడేవారు. ఇలా ఆయన సాహితీరంగంలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. 1984లో ఆయన రాసిన ‘నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో’ అనే పాట చాలా పేరు తెచ్చిపెట్టింది. అలా ఆయన రాసిన పాటలను జననాట్యమండలి కళాకారులు వారి సభల్లో పాడేవారు. ప్రజలు వాటిపట్ల ఎంతో ఆకర్షితులు అయ్యేవారు. ‘రాజ్యహింస పెరుగుతున్నాదో.. పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నదో’ అనే పెద్ద సంచలనమే సృష్టించింది. ఆయన రాసిన ‘జైభోలో జైభోలో అమరవీరులకు జై భోలో’ అనే పాటతో పాటు ‘కుబుసం’ సినిమా కోసం ఆయన రాసిన ‘పల్లెకన్నీరు పెడుతోంది’ అనే పాట ఎల్లలు దాటి మంచిపేరు తెచ్చిపెట్టింది.