Breaking News

సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలులో కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ శుక్రవారం సందర్శించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్, పెట్రోల్ బంక్ కార్మికులు, ఎరువుల దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తదితరులకు ప్రధాన వాహకులుగా భావించి వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మూడురోజులపాటు జిల్లావ్యాప్తంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపూర్ సెంటర్లలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ లో గుర్తించిన వారందరికీ వందశాతం వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఫీవర్ లక్షణాలు ఉన్న వారి వివరాలు పక్కాగా నమోదు చేయాలని, లక్షణాలు నమోదుచేసిన వారి ఇళ్లకు వెళ్లి నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని, అత్యవరమైతే ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్ల సలహా మేరకు వైద్యం చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట డీఐఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, అచ్చంపేట డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ వైద్య, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.