Breaking News

కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పల్లె నుంచి పట్నం వరకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఓ వైపు వైరస్ విజృంభణ మరోవైపు కూలినాలి పని చేసుకోకుంటే పూటగడవకపోవడంతో కుటుంబంలో ఎవరైనా బయటకెళ్లాలంటే కుటుంబం గుండెల్లో…తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొవాల్సి వస్తుందాయే. మహమ్మారి భయానికి కరోనా వ్యాధి లక్షణాలున్న వారు పట్టణాలతో పాటు గ్రామాల ప్రజలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నారు.

ఎవరికి ఉందో ఏమో !

కరోనా టెస్టులు చేసుకునేందుకు వచ్చిన మహిళలు, పురుషులతో పాటు కొంతమంది తల్లిదండ్రులు పసి పిల్లల, వృద్ధులను సైతం తీసుకొచ్చి క్యూలైన్లు కడుతున్నారు. సమయం గడిచినా కొద్దీ క్యూలైన్ పెరుగుతోంది. క్యూలైన్ కట్టిన వారిలో ఎవ్వరికి పాజిటివ్ వస్తుందో… మరెవరికి నెగెటివ్ రిపోర్టు వస్తుందోనని జనం భయంభయంగా టెస్టింగ్ కేంద్రాలకు ఉదయం 7గంటలకే చేరుకుని లైన్లు కడుతున్నారు. దీంతో పలు చోట్ల జనం క్యూలో ఉండకుండా చెప్పులను క్యూలైన్లలో పెడుతున్నారు. తమ చెప్పులు రాగానే టెస్టింగ్ చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ దృశ్యం శుక్రవారం కనిపించింది.  

లక్షణాలు ఉంటేనే టెస్ట్

ప్రభుత్వాస్పత్రుల్లో లక్షణాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే కరోనా చేస్తున్నారని పట్టణ ప్రజలతో పాటు పలు గ్రామాల జనం ఆరోపిస్తుండ్రు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల శాతం తగ్గించడంతో అనేక మంది జనం నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోక తప్పట్లేదని పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం తప్పని పరిస్థితుల్లో పలు జిల్లాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది రూపాయలను వెచ్చించి నిర్ధారణ పరీక్షలు చేసుకుంటుండ్రని ప్రజలు చెప్పుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా టెస్టుల శాతం పెంచాలని ప్రజలు కోరుతున్నారు.