- దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
- విజయ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ నేతల ధర్నా
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై నిరసన సెగ పార్లమెంట్‌ను తాకింది. పదిరోజుల్లో వరుసగా 9 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై కాంగ్రెస్ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. పెరుగుతున్న ధరలపై ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభలో నిరసనగళం వినిపించారు. పెంచిన ధరలను పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ అనే పేరుతో నిరసనలు చేపట్టారు. అంతకుముందు పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనలకు దిగారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. పెట్రోధరలపై చర్చించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరాల ముందు నీతులు వల్లిస్తూ దేశాన్ని దోచుకుంటున్నారని ప్రధాని మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. జోలె పట్టుకుని మాయమాటలతో దేశాన్ని దోచుకునేందుకు బయలుదేరారని దుయ్యబట్టారు. ఆసియాలోని పలు దేశాల పెట్రోరేట్లు, భారత్‌లో ఉన్న చమురు ధరలను పోల్చుతూ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ‘పెట్రోల్ రేట్లను భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. అఫ్గానిస్థాన్ లో రూ.66.99, పాకిస్థాన్ లో రూ.62.38, శ్రీలంకలో రూ.72.96, బంగ్లాదేశ్ లో రూ.78.53, భూటాన్ లో రూ.86.28, నేపాల్ లో రూ.97.05, ఇండియాలో రూ.101.81గా ఉంది’ అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నిరసనలు
ఇంధన ధరల పెంపును నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లో మాజీ సీఎం కమల్‌నాథ్ ఆధ్వర్యంలో మహిళలు ధర్నాలకు దిగారు. గ్యాస్ సిలిండర్లకు దండలు వేస్తూ ఆందోళనలు చేపట్టారు. చెన్నైలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ధరలు తగ్గించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగాయి. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. గత 10 రోజుల్లో 9సార్లు పెట్రోల్, డీజిల్ రేటు పెరిగిందని, పెరిగిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేత ఖర్గే డిమాండ్‌చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ సింఫ్వీు పాల్గొన్నారు.