- హెలికాప్టర్ ప్రమాద మృతుల గుర్తింపు
- మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత
న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైంది. సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ లిద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. మరో 10 మందిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.