Breaking News

కారులో రిక్తహస్తం ఎవరికో?

కారులో రిక్తహస్తం ఎవరికో?

  • అధికారపార్టీలో టికెట్ కోసం పోటాపోటీ
  • ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహులు

::: గంగు ప్రకాశ్​, సామాజికసారథి ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఏడాదిన్నర ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అటు అధికార పార్టీలోనూ అలజడి మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని ఎవరి వర్గం నాయకులు వారు అంచనాలు వేసుకుంటున్నారు. ముందస్తుగానే ఎవరికివారు ప్రజల్లో తిరుగుతూ తమకే వచ్చే ఎన్నికల్లో తమ టికెట్ ​వస్తుందని ప్రచారాలు మొదలుపెట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు చొప్పున నాయకులు పోటీపడుతున్నారు. టికెట్​రాకపోతే ఇతరపార్టీల వైపు చూస్తామని పరోక్షంగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. వారు పార్టీలో కీలకనేతలు కావడంతో పాటు బలమైన ఓటు బ్యాంకు కలిగిన నాయకులు కావడంతో ఆటో అధికారపార్టీ నేతల్లోనూ కలవరం మొదలైంది. ఏదైనా ఒక్కరికే టికెట్ వచ్చే అవకాశాలు ఉండటంతో మరో వర్గం నేతలు సహకరిస్తే తప్ప ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గాలి వీస్తుండటంతో కీలకనేతలు పార్టీకి హ్యాండిస్తే నేతల తలరాతలు తలకిందులు అవుతాయని అధిష్టానం అంచనావేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొల్లాపూర్ లో జూపల్లి వర్సెస్ బీరం
నాగర్ కర్నూల్ జిల్లా అనగానే మొదటిగా పార్టీ అంతర్గత కలహాలు గుర్తొచ్చే నియోజకవర్గం కొల్లాపూర్. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికారపార్టీలో చేరడంతో అక్కడ వర్గవిభేదాలు స్వాగతం పలికాయి. బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి జూపల్లి తన వర్గాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ తన అనుచరులకు అండదండగా నిలుస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్రంగా తన అభ్యర్థులను నిలబెట్టి పార్టీ అధిష్టానానికి తన బలం ఏమిటో చూపించారు. ఇటీవల కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయన నేరుగా జూపల్లి నివాసానికి వెళ్లి పార్టీ టికెట్ కేటాయిస్తానని చెప్పినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ బీరం హర్షవర్ధన్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయిస్తే జూపల్లి స్వతంత్రంగానైనా లేదా ఇతర పార్టీ నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు పంపించారు. కాంగ్రెస్​ పార్టీలోకి కూడా వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో వర్గపోరు పార్టీ అధిష్టానానికి పెద్దసమస్యగా మారింది.

కల్వకుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
కల్వకుర్తి నియోజకవర్గ విషయానికొస్తే అక్కడ అధికారపార్టీ నేత ఎమ్మెల్యే జైపాల్​యాదవ్,​ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య అంతర్గతంగా వర్గపోరు నడుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇస్తానని చెప్పిన అధిష్టానం చివరికి గా జైపాల్​యాదవ్​కు కేటాయించడంతో గుర్రుగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ మారేందుకు అప్పట్లో యత్నించారని కొద్దిరోజులు ప్రచారం నడిచింది. కానీ కేటీఆర్ మంత్రాంగం ఫలించడంతో తన ఈ ప్రయత్నాలను విరమించుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీచేయాలని తహతహలాడుతున్నారని కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరవర్గాల ద్వారా తెలిసింది. అధికారపార్టీ నుంచి టిక్కెట్ రాకపోతే ఇతర పార్టీల నుంచి పోటీచేసేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇతర పార్టీనేతలతో టచ్ లోకి వెళ్లిన ఆయన సమయం చూసి అధికారపార్టీని దెబ్బకొట్టేందుకు వేచి చూస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా, మరోనేత, టీఆర్ఎస్​శ్రీనివాస్​రెడ్డి కూడా టికెట్​ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశానని, పార్టీ కోసం ఎంతో చేశానని, తనకు మంత్రి కేటీఆర్ కూడా హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆయన పలు సేవాకార్యక్రమాలతో అనుచరవర్గాన్ని పెంచుకుంటున్నారు.​

అచ్చంపేటలో అదృష్టం ఎవరిదో?
రెండు పర్యాయాలు అచ్చంపేట నియోజకవర్గం నుంచి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గువ్వల బాలరాజు ఈసారి కూడా తనకే టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. అధిష్టానం వద్ద తనకు మంచి పలుకుబడి ఉందని తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వద్ద అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ నేత నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. కానీ అధిష్టానం ఇటీవల నిర్వహించిన సర్వేలో మాత్రం మాజీమంత్రి ప్రస్తుతం నాగర్​కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు పోతుగంటి రాములుకు సర్వేలు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నియోజకవర్గంలో రాములుకు టికెట్ కేటాయిస్తారని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు గువ్వల బాలరాజుకు పార్లమెంట్​టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పోతుగంటి రాములు పోటీకి వెనకడుగు వేస్తే ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషిస్తున్నారు. నాగర్​కర్నూల్​జడ్పీ చైర్మన్ గా అవకాశమిస్తానని చెప్పిన అధిష్టానం అప్పట్లో ఆ హామీ నెరవేర్చకపోవడంతో కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఓవైపు సర్వేలు కూడా ప్రతికూలంగా అనుకూలంగా ఉండటంతో అచ్చంపేటలో అభ్యర్థి మారవచ్చని తెలుస్తోంది.

నాగర్ కర్నూల్ లో పోటాపోటీ
గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు ఈసారి చాపకింద నీరులా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విజయానికి విశేషకృషి చేశారు. అయితే తదనంతరం రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీకి ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో తాను చెప్పిన మాటే నడవాలంటే అధికారులకు హుకుం జారీచేయడంతో కినుక వహించిన దామోదర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఇటీవల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటనలో మరోసారి ఎమ్మెల్యే టికెట్ మర్రి జనార్దన్ రెడ్డి కేటాయిస్తామని చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ప్రకటించడం.. ఎమ్మెల్యే అనుచరవర్గాల్లో ఆనందోత్సాహాలు కలిగించింది. అయినప్పటికీ మరోవైపు అధిష్టానంలో కీలకనేతలు దామోదర్ రెడ్డి కుమారుడిని సైతం అధికార పార్టీ నుంచి బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉండమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్నినెలలుగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు డాక్టర్​కె.రాజేశ్​రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలను చుట్టేస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని, తమ కుమారుడిని పోటీకి దించేందుకు దామోదర్ రెడ్డి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్​చేసుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా దామోదర్ రెడ్డి తన కుమారుడిని దింపితే నియోజకవర్గంలో అధికార పార్టీ విజయం తలకిందులు కావచ్చని కొంతమంది సీనియర్​రాజకీయవేత్తలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏదేమైనా అధికార టీఆర్ఎస్​పార్టీలో నిలిచేదెవరో.. గెలిచేదెవరో చివరిదాకా వేచి చూడాల్సిందే.