- సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు
- ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు
- తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు..
- 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు
సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగరంలో నివాసం ఉంటున్న అనేకమంది సొంతూళ్లకు బయలుదేరివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. రోజూ నడిపే బస్సులకు అదనంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు జంటనగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,334 ప్రత్యేక బస్సులను, ఏపీలోని వివిధ ప్రాంతాలకు 984 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్లతో పాటు శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఎం వివరించారు. వీటి పర్యవేక్షణ కోసం 200 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.
అదనపు చార్జీలు లేకుండానే..
సంక్రాంతి ప్రత్యేక బస్సులు తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట తదితర పట్టణాలకు నడవనున్నాయి. అలాగే విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామర్రు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కొన్ని పాయింట్ల నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు నగరంలోని బీహెచ్‌ఈల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి నేరుగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడానికి ఏర్పాట్లు చేశారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నామమాత్రపు టికెట్ల ధరతో ప్రత్యేక బస్సులు కల్పిస్తామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సును పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని, వివరాలకు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ 99592 26117 సంప్రదించాలని సూచించారు.