బిజినేపల్లి మండలం వెలుగొండలో ఉద్రిక్తత
సామాజికసారథి, బిజినేపల్లి: అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే పాటలతో ఊరేగింపు నిర్వహిస్తున్న కొందరు దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన పలువురు అగ్రకులస్తులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరుఊరంతా కదిలివచ్చి ఆ మహనీయుడి సేవలను కొనియాడారు. రాత్రి ఊరేగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డీజేకు ముందుకు సాగుతున్నారు. ‘మమ్మల్ని ఎవడురా తక్కువ కులపోళ్లు అన్నది’ అనే సాంగ్ కు యువకులంతా డాన్స్ లు చేస్తున్నారు. ఇంతలో గ్రామానికి చెందిన కొందరు అగ్రకులస్తులు రంగప్రవేశం వేసి డీజేను బంద్ చేయించారు. ఎందుకు ఆపు చేస్తున్నారని దళిత యువకులు ప్రశ్నించడంతో మాటామాట పెరిగి దాడుల దాకా వెళ్లింది. దీంతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కొందరు దళిత యువకులు గాయపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీజే వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.