Breaking News

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !
  • వందశాతం ఆధార్‌తో అనుసంధానం

సామాజిక సారథి, హైదరాబాద్‌: రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్‌ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్‌ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్​మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్‌ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడంతో రేషన్​కార్డు ఉన్న లబ్ధిదారులు ఎవరో ఒకరు వచ్చి వేలు ముద్రవేసి సరుకులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో గడువులోగా ఎంతమంది వినియోగదారులు రేషన్​దుకాణాలకు వచ్చి సరుకులను తీసుకొని వెళ్లారో రికార్డు అవుతుంది. అందుకే ఆధార్‌ అనుసంధానికి ప్రభుత్వం జూన్‌ 30 వరకు అవకాశం కల్పించగా ముందుగానే జిల్లాలో వంద శాతం ఆహారభద్రత కార్డులు అనుసంధానం చేశారు. దీంతో రేషన్‌ అక్రమాలకు అడ్డుకట్టపడనుంది.