- భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్
- పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట
సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్ భవన్ ’ ఉద్రిక్తంగా మారింది. భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్రస్థాయిల అన్యాయం చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని భట్టి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నాయకులందరినీ పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసనకు దిగారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధు యాష్కీ, చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పార్టీ సీనియర్లు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు.