Breaking News

ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు

ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు
  • కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరవేస్తాం
  • ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం
  • బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్
  • ‘సామాజిక సారథి’తో ‘చిట్​చాట్’​

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్​సమాజ్​పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్​కర్నూల్​జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్​చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ అంటున్నారు. బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ‘సామాజిక సారథి’ ‘చిట్​చాట్’లో మాట్లాడారు.

మీరు టీఆర్ఎస్​ను ఎందుకు వీడారు?

రాజకీయాల్లో చాలా రోజులు నుంచి ఉన్నా. తెలంగాణ ఉద్యమ సమయం 2001 నుంచి టీఆర్ఎస్​లో చాలా కీలకంగా పనిచేశాను. ఆ పార్టీకి ఉద్యమం ముసుగు తొలగిపోయింది. ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. మొదటి నుంచీ పార్టీలో పనిచేసిన వారికి విలువ లేకుండాపోయింది. రాజకీయాల్లో ఉన్నాం కదా.. పేదవర్గాలకు, ముఖ్యంగా బహుజనులకు సేవచేయాలని టీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరాను.

జిల్లాలో బీఎస్పీ పరిస్థితి ఏంది?

చాలా చైతన్యవంతమైన జిల్లా నాగర్​కర్నూల్. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ బీఎస్పీలో చేరిన తర్వాత జిల్లాలో పార్టీకి మంచి ఊపు వచ్చింది. కేడర్​లో నూతనోత్సాహం నిండింది. సార్​కూడా త్వరలోనే ఊరుఊరికి రానున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యావంతులైన యువత, నిరుద్యోగులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘ఏ గ్రామానికి వెళ్లినా మన ఓటును మన పార్టీకే వేసుకుందాం’ అనేంతటి స్థాయిలో చైతన్యం వచ్చింది. కందనూలు గడ్డపై నీలి జెండాను ఎగరవేస్తామనే ధీమా నాకుంది.

సామాజిక పరివర్తన సభ’ను ఎలా సక్సెస్​ చేశారు?

బీసీలు, దళితులు, గిరిజనులు, మత మైనార్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఇది. ఆయా వర్గాల ప్రజల్లో చైతన్యం నింపి ఐకమత్యం చేయాలని సంకల్పించాం. నెలరోజులకుపైగా జిల్లాలోని ప్రతి ఇంటికీ, ప్రతి గడపకు వెళ్లాం. బీఎస్పీతోనే బహుజనుల బతుకులు బాగుపడతాయని ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాం. పాలకులకు దడ పుట్టేలా సామాజిక పరివర్తన సభకు శ్రీకారం చుట్టాం. సుమారు సుమారు లక్షమందికిపైగా స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్​చేశారు. ఎవరికీ బిర్లు, బిర్యానీలు, డబ్బులు ఇవ్వలేదు. సొంత ఖర్చులు, వాహనాలను సమకూర్చుకొని తరలివచ్చారు. ఈ సభ మాపై గొప్ప బాధ్యత పెట్టిందని భావిస్తున్నాం.

నాగర్​కర్నూల్​లో టీఆర్ఎస్​తో గొడవ ఎందుకు?

బీఎస్పీకి ఏ రాజకీయ పార్టీతోనూ గొడవల్లేవ్. మేం ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నాం. అభివృద్ధి, ప్రజాసమస్యలపై అధికార టీఆర్ఎస్​పార్టీని ప్రశ్నిస్తున్నాం.మేం ప్రజల పక్షాన బహుజనులకు రాజ్యాధికారమనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. సామాజిక పరివర్తన సభ జరిగిన మరుసటి రోజున నుంచే వాల్​రైటింగ్​తుడిచివేయించారు. అన్ని రాజకీయ పార్టీలను వదిలి మాపైనే ఎందుకు? అనాదిగా పీడనకు, దోపిడీకి గురవుతున్న బహుజనులు ఏకమైతే తమ పీఠాలు కదిలిపోతాయని వారిలో భయం మొదలైంది.

మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?

నాగర్​కర్నూల్​జిల్లాలో ఏనుగు గుర్తును ఇంటింటికీ తీసుకెళ్తాం. బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపిస్తాం. విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపై దశల వారీగా ఉద్యమకార్యాచరణ తీసుకోబోతున్నాం. గతంలో పార్టీ కోసం పనిచేసిన అందరినీ ‘మన ఇంటి పార్టీ బీఎస్పీ’లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎస్పీ, ఎస్టీ, బీసీలు, మత మైనార్టీలు, అగ్రకులాల్లోని పేదల కోసం పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ జెండాను ఎగరవేయబోతున్నాం. అందుకు క్షేత్రస్థాయిలో ఆల్ రెడీ మా కార్యచరణ ప్రారంభమైంది.