- కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్ చేస్తున్నాం
- పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్‌ఎస్ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఉభయసభలకు చెందిన టీఆర్‌ఎస్ సభ్యులు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర్రావు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీది ఫాసిస్ట్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీపై తిరుగుబాటు చేసేలా సమాయత్తం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ఆందోళనలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. చట్టసభలను బాయ్‌కాట్ చేయడం బాధ కలిగించే విషయమే.. కానీ కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్ చేస్తున్నామని ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు.