Breaking News

ఎన్నో అవమానాలు భరించా..- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి

-ఎన్నో అవమానాలు భరించా..

– ఏనాడు పైసా ఆశించలే..

– నా అభిమానులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు..

– ప్రజల కోసం ఎంతో చేశా..

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన అనుచరులు, అభిమానులు, తన వెంట నడిచినవారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపించి వేధించి నానాఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీ, పదవిలో ఉండి కూడా ఎందుకు పార్టీ మరాలిసి వచ్చిందో నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి నుంచి ఏనాడూ పైసా ఆశించలేదని, అవినీతి, అశ్రితపక్షపాతానికి పాల్పడలేదని ఆయన స్పష్టంచేశారు. ఎవరి వద్ద కూడా చేయి చాచలేదని చెప్పారు. ప్రజల కోసం తమ ఆస్తులను దానం చేశామే తప్పా, అక్రమంగా ఆస్తులు సంపాదించుకోలేదన్నారు. పేదలకు విద్యావైద్య సదుపాయాలు కల్పించానని తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు, ఎమ్మెల్యే విజయం కోసం ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుని ఊరూరా తిరిగి ఎంతో కృషిచేశానని చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా విజయవంతం చేశానని తెలిపారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తన ఊపిరి ఉన్నంత వరకు కృషిచేస్తానని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తెలిపారు.