- వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి
- డెల్టా కంటే 6 రెట్లు వేగంగా
- వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం
- మాస్క్ మన జేబులో ఉండాల్సిందే
- హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
సామాజికసారథి, హైదరాబాద్: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని అనుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, వచ్చే రెండు నుంచి నాలుగు వారాల దేశానికే కాదు రాష్ట్రానికి ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో రానున్న రోజుల్లో ఎప్పుడూ చూడని పరిస్థితులు చూడబోతున్నామని హెచ్చరించారు. గతంలో నమోదైన కేసులతో పోల్చితే ఒకే రోజులో ఐదురెట్లు కరోనా కేసులు పెరగనున్నాయని వివరించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ కేసులు కూడా ఒకేసారి పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. ఇది మూడో వేవ్‌కు ప్రారంభమన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి వేడుకలు వస్తున్నాయన్నారు. పబ్లిక్ మూమెంట్ భారీగా ఉంటుందన్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కొవిడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు.
డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి
ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. కానీ సుమారు 30 రెట్ల వేగం వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు వహించి కరోనా వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదన్నారు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సౌత్ ఆఫ్రికాలో టెస్టులు పూర్తిగా నిలిపి వేశారన్నారు. గతంలో కరోనా రెండు వేవ్ లు వచ్చినప్పుడు కొవిడ్ పై విజయం సాధించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
భయపడాల్సిన అవసరం లేదు..
ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్ వేవ్ అరికట్టేందుకు చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందామన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంతకుముందే ఎప్పుడూ లేనంత పరిస్థితి మనం చూడొచ్చన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్క్ మన జేబులో ఉండే వ్యాక్సిన్ లాంటిందన్నారు. దాన్ని జేబు నుంచి నోటికి ముక్కుకు కలిపి తగిలించుకోవాలనుకున్నారు. మన వద్ద ఉన్న మరో బలమైన ఆయుధం వ్యాక్సిన్ అన్నారు. అంతా తప్పకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ థర్డ్ వేవ్ కరోనాకు ముగింపు అన్నారు. ఎక్కడ అజాగ్రత్త ఉంటుందో అక్కడే వైరస్ పొంచి ఉంటుందన్నారు. తెలంగాణలో జీనోమ్ సీక్వెన్స్ చేసే ల్యాబ్ రెండే ఉన్నాయని చెప్పారు. వేరియంట్ ఏదైనా సరే ముందు ట్రీట్ మెంట్ తీసుకోవాలని సూచించారు. అపోహాలు ఉంటే నమ్మకూడదని హితవు పలికారు.