సారథి, అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఊరుకునేది లేదని, జలదోపిడీపై అక్కడే పాతరేస్తామని నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రియ నాయక్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ సైంధవపాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన విమర్శించారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామని సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్జగన్ మోహన్‌రెడ్డికి స్నేహహస్తం అందించారని గుర్తుచేశారు. పంటల మార్పిడిపై రైతులు దృష్టి సారించి పప్పుదినుసులు, నూనెగింజలు, పత్తి వంటి పంటలు వేయాలని కోరారు. సమావేశంలో రంగాపూర్ సర్పంచ్ లోక్యనాయక్, నాయకులు శివ, రమేష్ నాయక్, జయరాం, శంకర్ పాల్గొన్నారు.