Breaking News

సమీకృత గురుకులానికి తొలి అడుగు!

సమీకృత గురుకులానికి తొలి అడుగు!
  • నాగర్​ కర్నూల్​ సిగలో మరో మణిహారం
  • ఈనెల 11న తూడుకుర్తిలో శంకుస్థాపన
  • ఫలించిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి,
  • ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి కృషి
  • 25 ఎకరాల్లో ఏర్పాటుకు శ్రీకారం
  • 4 – 12వ తరగతులకు వరకు విద్యాబోధన

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గురుకులానికి తొలి అడుగుపడింది. నాగర్​ కర్నూల్​ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూలు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూల్లు, కాలేజీల్లో చదవలేని పేద విద్యార్థులు ఇక్కడే నాణ్యమైన ఉన్నతవిద్య వరకు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 సమీకృత గురుకులాలకు ఈ నెల11న శంకుస్థాపన చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌‌‌‌ గురుకులాలలను ఒకే క్యాంపస్‌‌‌‌ లో నిర్వహించడం.. అన్ని కులాలు, మతాలకు చెందినవారిని ఒకే కాంపౌండ్​ లో చదువుకునేలా చేయడం ఈ వ్యవస్థలోని గొప్పతనం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ నిర్మించనున్నారు. ఒకే ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌‌‌ గురుకులాలను నిర్వహించేలా ఈ క్యాంపస్‌‌‌‌ నిర్మించనున్నారు. స్కూల్‌‌‌‌, హాస్టళ్లకు వేర్వేరు బిల్డింగ్స్‌‌‌‌ నిర్మించడమే కాదు.. విద్యార్థుల వికాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడేలా ప్లే గ్రౌండ్‌‌‌‌, పేరెంట్స్‌‌‌‌ తో మీటింగ్‌‌‌‌ కోసం ప్రత్యేకంగా హాల్‌‌‌‌ సహా ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత గురుకులాల్లో మాదిరిగా స్టూడెంట్స్‌‌‌‌ ఎక్కడో దూరంగా వెళ్లి చదువు కోవడం కాకుండా సొంత మండలాల్లోనే వారికి అడ్మిషన్​లు దక్కేలా చూడాలని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టమైన సూచనలు కూడా చేశారు.

ప్రపంచంతో పోటీపడేలా శిక్షణ
ప్రస్తుతం అరకొర సౌకర్యాలున్న భవనాల్లో పలు గురుకుల స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయి. వందలాది మందిని ఉంచి చదువు చెప్పిస్తున్నారు. అనేక గురుకులాలకు కనీసం ప్లే గ్రౌండ్‌‌‌‌ లేదు. బాలికల గురుకులాల్లో రెండు, మూడు వాష్‌‌‌‌ రూమ్‌‌‌‌ లే ఉన్నాయి. మొదటిదశలో నియోజవకర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ నిర్మించి.. అందులోనే అన్ని కులాలు, మతాల వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తే రేపటి సమాజంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండవన్నది ప్రజాప్రభుత్వ అభిమతం. విద్యావేత్తలు, సామాజికవేత్తల అభిప్రాయాలు తీసుకొని అందరి సలహాలు, సూచనల మేరకే ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ ఏర్పాటులో కాంగ్రెస్​ సర్కార్​ ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని 49 నియోజకవర్గాల్లో ఈ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించారు. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్‌‌‌‌ సోషల్‌‌‌‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌) కింద నిధులు సేకరించి అన్నివర్గాల భాగస్వామ్యంతో ఈ విద్యాలయాలను నెలకొల్పాలని సంకల్పించారు. అందులో భాగంగానే నాగర్​ కర్నూల్​ నియోజకవర్గ పరిధిలోని తూడుకుర్తిలో ఈనెల 11న శంకుస్థాపన చేయనున్నారు.

తూడకుర్తికి పెరిగిన ఖ్యాతి
తూడుకుర్తి.. కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి, నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి పుట్టిపెరిగిన ఊరు. ఇద్దరూ కూడా విద్యాధికులు. సదరు ఇద్దరు నేతలు చొరవ తీసుకుని సీఎం ఎ.రేవంత్​ రెడ్డి, మంత్రులను ఒప్పించి తన స్వగ్రామంలో ఏర్పాటుచేసేలా తీవ్రంగా కృషిచేయగా.. వారి ప్రయత్నం ఫలించింది. గ్రామంలో ఇప్పటికే 25 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఇక్కడ 4 నుంచి 12వ తరగతి వరకు విద్యను బోధించనున్నారు. కూచకుళ్ల దామోదర్​ రెడ్డి.. తన స్వగ్రామంలో అన్ని వసతులు ఉండేలా సంకల్పించారు. ఇప్పటికే నేత్ర వైద్యశాల ఏర్పాటుతో గ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఎంతోమంది పేదలు ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. ఆలయాలను అభివృద్ధి చేశారు. పేదలు వివాహాలు జరిపించుకునేందుకు ఫంక్షన్​ హాలును కూడా కట్టించారు. ఇప్పుడు విద్యాపరంగా మరింత అభివృద్ధి చెందడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యాభిమానులు, గ్రామపెద్దలు, యువజనులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *