Breaking News

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్

సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. వరి పంటలో వెదజల్లే పద్ధతి ద్వారా పెట్టుబడి గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన ఉత్తమ రైతు తోట నర్సింలు అనుభవాలను సవివరంగా రైతులకు తెలియజేశారు. పీఎస్ బీ వల్ల భూమిలో ఉన్నటువంటి నిల్వ భాస్వరాన్ని ఉపయోగించుకుని ఎరువుల వాడకం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కంది విత్తనాలను రైతులకు అందజేశారు. పప్పు దినుసులు, నూనెగింజల పంటలు, ఆరుతడి పంటలు పండించి అధిక దిగుబడి సాధించిన రైతులను ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయాధికారి సతీష్, వ్యవసాయ విస్తరణాధికారులు గణేష్ కుమార్, దివ్య శ్రీ నిజాంపేట్ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, రైతుబంధు సమితి మండల, విలేజ్ కోఆర్డినేటర్లు, సహకార సంఘం చైర్మన్, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.