- నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు
సారథి, నర్సాపూర్: ఆకలి ఉన్నంత కాలం వ్యవసాయం అవసరం ఉంటుందని నాబార్డు చైర్మన్ గోవిందరాజులు అన్నారు. గ్రామాల్లో వ్యవసాయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందన్నారు. రూ.లక్షల కోట్లతో నాబార్డ్ సంస్థ వ్యవసాయరంగానికి చేయూతనిస్తుందన్నారు. విద్యార్థులు ఫీల్డ్ లో నేర్చుకున్న వ్యవసాయ సాంకేతికత దేశానికి ఉపయోగపడాలన్నారు. సోమవారం మెదక్జిల్లా నర్సాపూర్ మండలం తునికి గ్రామ శివారులోని విజ్ఞాన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీ 24వ స్నాతకోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి, బెయర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఆరు నెలల ఒకేషనల్ డిప్లొమా అగ్రికల్చర్ పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, పాలిటెక్నిక్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ పద్మజ, ప్రెసిడెంట్ డీఎన్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రమిస్తే ఉన్నత స్థానాలకు చేరవచ్చన్నారు. విజ్ఞాన జ్యోతికి వ్యవసాయ రంగంలో మంచి పేరు ఉందన్నారు. దేశంలో ఆరు లక్షల ఫైబర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల చదువుకు ప్రతి పైసా విజ్ఞానజ్యోతి ఖర్చుచేస్తుందన్నారు. అనంతరం కిడ్స్ డెవలప్మెంట్కోసం విజ్ఞానజ్యోతికి రూ.24 లక్షలను నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు అందజేశారు. ఆరు నెలల అగ్రికల్చర్ కోర్స్ పూర్తిచేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు స్నాతకోత్సవ సభలో మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. రామానాయుడు విజ్ఞాన జ్యోతి సంస్థ డైరెక్టర్ అర్జున్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన జ్యోతి డైరెక్టర్ అర్జున్ రావు, పాలిటెక్నిక్ కాలేజీ డైరెక్టర్ పద్మజా, శేషగిరిరావు, జాయింట్ సెక్రటరీ చైర్మన్ దుర్గాప్రసాద్ రావు, చైర్మన్ అచ్యుత రాంప్రసాద్, నూజివీడు సీడ్స్ కంపెనీ చైర్మన్ కృష్ణారావు, కాలేజీ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.