సారథి, హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజాఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఈటల అక్రమాస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఇళ్లపై ఐటీదాడులు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు క్రిమినల్ కేసుపెట్టాలని కోరారు.
ఓ మెడికల్ కాలేజీలో 75 శాతం వాటా, మరో కాలేజీలో 50 శాతం ఉందని పేర్కొన్నారు. ఈటలకు ఢిల్లీలో ఓ భవనం, వందల ఎకరాల్లో రూ.కోట్ల విలువ చేసే ఫాం హౌజ్ ఉన్నాయని పేర్కొన్నారు. 19 డిమాండ్లతో కూడిన కరపత్రాలను తిప్పారపు సంపత్ పేరిట ముద్రించి ఉన్నాయి. కాగా, రెండురోజుల క్రితం ఈటలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిప్పారపు సంపత్ టవర్ ఎక్కాడు. సోమవారం ఈటల పర్యటన సందర్భంగా పోలీసులు అతని ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతని పేర కరపత్రాలు వెలుగు చూడడం స్థానికంగా కలకలం రేపుతోంది.