Breaking News

9 మందిని చంపిన.. రాక్షసుడికి మరణశిక్ష

9 మందిని చంపిన.. రాక్షసుడికి ఉరిశిక్ష

సారథి న్యూస్, వరంగల్: తన క్రూరమైన ఆలోచనలతో ఒకేరోజు 9 మందిని హత్యచేసిన నిందితుడు, బీహార్​కు చెందిన సంజయ్ కుమార్ కు కోర్టు బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుగొండ మండలం గోర్రెకుంటలో 9మందిని హత్యచేసి బావిలో పడవేసిన ఘటన తెలిసిందే. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ అనంతరం వరంగల్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
మృతుల వివరాలు:
మహమ్మద్ మక్సూద్ ఆలం(47), మహమ్మద్ నిషా అలం(40), మహమ్మద్ బుద్రా కాటూన్(20), బబ్లూ(3), మహమ్మద్ షాబాజ్(19), మహ్మద్​సొహైల్​(18), శ్యాం కుమార్ షా(18), శ్రీరాం కుమార్ షా(21), మహ్మద్ షకీల్(38)
ఎలా జరిగిందంటే..
జీవనోపాధి కోసం వరంగల్ లో ఉంటున్న నిందితుడు సంజయ్ కుమార్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని శాంతినగర్ లోని గోనేసంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. ఇక్కడే మృతుడు మక్సూద్ ఆలం కుటుంబసభ్యులతో సంజయ్ కు పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో మక్సూద్ భార్య నిషా అక్క కూతురు పశ్చిమబెంగాల్​రాష్ట్రానికి చెందిన రఫీకా(37)తో సంజయ్​కుమార్​కు పరిచయం కలిగింది. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజయ్ మరింత దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం కొనసాగించాడు. ఈ క్రమంలో రఫీకా పెద్దకూతురుతో సంజయ్​చనువుగా ఉండడంతో పలుమార్లు గొడవ జరిగింది. ఎలాగైనా రఫీకాను అంతమొందించాలని నిర్ణయించుకుని తమ పెళ్లి విషయాన్ని బంధువులతో మాట్లాడదామని చెప్పి పశ్చిమ బెంగాల్​కు తీసుకెళ్లాడు. మార్చి 6న విశాఖపట్నం వెళ్లే గరీభ్ రథ్ ట్రైన్ ద్వారా వరంగల్ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో తాడేపల్లిగూడెం సమీపంలో రఫీకాను చంపేశాడు. మరుసటి రోజు రాజమండ్రి రైల్వే స్టేషన్​నుంచి మరో రైలులో నిందితుడు వరంగల్లుకు చేరుకున్నాడు.

రఫీకా పశ్చిమబెంగాల్​లోని తమ బంధువుల ఇంటికి వెళ్లినట్లు నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత తన అక్క కుతూరు రఫీకా తమ బంధువుల ఇండ్లలో లేదని, ఎక్కడ ఉందో చెప్పాలని మక్సూద్ ఆలం భార్య నిషా ఆలం సంజయ్​ను గట్టిగా అడిగింది. కంగుతిన్న అతడు పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్​ఆలం, భార్య నిషా ఆలంను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా మే 20న మక్సూద్​మొదటి కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలియడంతో అదేరోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వరంగల్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొన్నాడు. తనకు అనుకూలంగా ఉన్న సమయంలో సంజయ్​మక్సూద్ కుటుంబసభ్యులు వండిన భోజనంతో పాటు ఇదే గోదాంలో పనిచేస్తున్న శ్యాం, శ్రీరాం వండిన భోజనంలో కూడా వారికి తెలియకుండా నిద్రమాత్రలు కలిపాడు. అర్ధరాత్రి సమయంలో మత్తులో ఉన్న 9మందిని గోదాం పక్కనే ఉన్న పాడుపడ్డ బావి వద్దకు తరలించి అందులో పడేశాడు. ఊపిరాడక అందరూ చనిపోయారు. అతితక్కువ సమయంలోనే కేసును ఛేదించి నిందితులకు శిక్షపడేలా చేసినా పోలీసు అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ అభినందించారు.