2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్‌ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)ప్రభావంతో ఆ లిస్ట్ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్‌కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్ఉంటుంది. ఈ సీజన్లో స్టార్ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది రిలీజైన మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘బన్నీ’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బ్లాక్బస్టర్కావడంతో పరిశ్రమ మొదట కొంత ఆశాజనకంగానే ఉంది. కళ్యాణ్రామ్సినిమా ‘ఎంత మంచి వాడవురా’, రవితేజ ‘డిస్కోరాజా’, నాగశౌర్య ‘అశ్వత్థామ’ ఫ్లాప్లిస్ట్లోకి చేరి చతికిలబడ్డాయి. శర్వానంద్ ‘జాను’ కూడా అంతతమాత్రమే అనిపించుకుంది. ఫిబ్రవరిలో రిలీజైన విజయ్‌దేవరకొండ చిత్రం ‘వరల్డ్ఫేమస్లవర్’ డిజాస్టర్అయింది. నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ సక్సెస్‌బాట పట్టి నితిన్కెరీర్ లోనే సూపర్హిట్మూవీగా నిలిచింది. నాని నిర్మాతగా మారి విశ్వక్సేన్తో తీసిన ‘హిట్’ కూడా విజయాన్ని సాధించి బాక్సాఫీసుకు వసూళ్లు రాబట్టింది. మార్చి 6న రిలీజైన ‘పలాస’ చిత్రం థియేటర్లో పెద్దగా ఆడకపోయినా విమర్శకులను మెప్పించింది. అంతే.. ఆ తర్వాత థియేటర్లు మూతపడి ఇండస్ట్రీ పరిస్థితులు ఒక్కసారిగా తల్లకిందులయ్యాయి.
థియేటర్లు మూతపడ్డాయ్..
మార్చి 17 నుంచి కోవిడ్కారణంగా థియేటర్లు మూతపడి సినిమాల రిలీజ్కు ఊహించని బ్రేక్ పడింది. షూటింగ్మధ్యలో ఉన్న చాలా పెద్ద చిత్రాలు ఆగిపోయాయి. చిన్న సినిమాల సంగతి సరేసరి. ఫస్ట్ కాపీ చేతికొచ్చినా థియేటర్లు లేకపోవడంతో నిర్మాతలు డీలా పడిపోయారు. చివరికి ఓటీటీ సంస్థలు చొరవ చూపించి, ముందుకు రావడంతో కొద్దో గొప్పో సినిమాలు విడుదలయ్యాయి. కానీ వీటికి ఓటీటీ పెద్ద ఊరటనిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓటీటీలే దిక్కు
విమర్శకులను మెప్పించిన ‘పలాస’ సినిమా థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమాకి వ్యూవర్షిప్ పెరిగింది. ‘నాదీ నక్కిలీసు గొలుసు..’ పాట మాస్‌లోకి వెళ్లడంతో ఈ చిత్రం వ్యూవర్స్‌కు ఇంకాస్త దగ్గరైంది. ఏప్రిల్ 29న జీ 5లో అమృతారామమ్
విడుదలైంది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. ఆ తర్వాత.. ఓటీటీ సినిమాలు వరుస కట్టాయి. కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్
అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్.. ఇలా చిన్న సినిమాలన్నీ ఓటీటీ లో ఊపందుకుని చిన్న పరిశ్రమవారిని కాసింత ఓదార్చాయి. దీన్నిబట్టి ఓటీటీలో ఓ పెద్ద సినిమా వస్తే మార్కెట్ రేటు పుంజుకుంటుందేమో అనుకుని నాని నటించిన ‘వి’ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. నాని, సుధీర్ బాబు కథానాయకులుగా నటించడం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు అవడం, దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే వాటిని అందుకోవడంలో ‘వి’ విఫలమైంది. ఇదే దారిలో వచ్చిన ‘నిశ్శబ్దం’ సైతం.. నిశ్శబ్దంగా మిగిలిపోతే.. కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ మిస్ ఫైర్ అయిపోయింది. వరుస మూడు పెద్ద డిజాస్టర్లు ఓటీటీలో చిత్రాలు రిలీజ్కాకపోవడాన్ని మాత్రం ఆపలేకపోయాయి. ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ లాంటి చిన్న సినిమాలు ఓటీటీలో మెరిశాయి. ఇంకా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఓ కొత్త సినిమా థియేటర్లోకి రావడం ఆనవాయితీ. వాటిని ఓటీటీలూ పాటించాయి. ప్రతి వారం ఓటీటీలో ఏదో సినిమా వస్తూనే ఉంది. ‘ఆహా’ కొన్ని డబ్బింగ్ సినిమాలను బల్క్ గా కొనేసి, ఒక్కొక్కటీ వదులుతోంది. హిందీ, మలయాళ సినిమాలు సైతం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి.
సర్కారు వారి ఊరట
థియేటర్లు లేని లోటుని తీర్చడంలో ఓటీటీలు కొంత వరకూ సఫలీకృతమయ్యాయనే అనొచ్చు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా.. థియేటర్లు తెరచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అయినా సరే.. నిర్మాతలకు ఊపు రాలేదు. కొత్త సినిమాల తాకిడి ఇంకా కనిపించడంలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సర్దుకుపోవడం నిర్మాతలకు ఇష్టం లేదు. తమ ఆదాయాన్ని సగానికి సగం తగ్గించుకోవడం ఇష్టం లేకపోవడంతో కొత్త సినిమాలు రాలేదు. పైగా నిర్మాతలకూ, ఎగ్జిబీటర్లకూ మధ్యన చర్చలు సఫలం కాలేదు. క్రిస్మస్ నుంచి కొత్త సినిమాలు రావాల్సి ఉంది. అప్పటికి ఈ చర్చలు ఫలప్రదం అవుతాయో లేదో చూడాలి మరి.
ఆశలన్నీ 2021 పైనే..
ఈ క్రిస్మస్పండగకు సినిమాలు వచ్చినా, రాకపోయినా.. ఆశలన్నీ 2021పైనే పెట్టుకున్నారు దర్శకనిర్మాతలు. 2021 సంక్రాంతి నాటికి పరిస్థితులు చక్కబడతాయన్నది అందరి నమ్మకం. సంక్రాంతికి ఎలాగూ పెద్ద సినిమాలు రెడీ అవుతాయి. ప్రేక్షకులకు సినిమాలపై ఆసక్తి వుందా? ధైర్యం చేసి థియేటర్లకు వస్తారా? అనే విషయాలు సంక్రాంతికి తేలిపోతాయి. అప్పటిలోగా 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధన కూడా పక్కకు వెళ్లిపోతుందని భావిస్తున్నారు. అదే జరిగి.. 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతిస్తే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రాజీ కుదిరితే.. 2021 నుంచి అసలైన సినిమా వినోదం చూడొచ్చు. 2020లో కోల్పోయిన దాన్ని వడ్డీతో సహా రాబట్టాలని చిత్రసీమ భావిస్తోంది. మరి 2021లో సినిమా జాతకం ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.