- రౌడీషీటర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా
- బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్షిప్
- ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర
కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి అతనిపై కేసులు ఉన్నాయి, పొలిటికల్ సపోర్ట్‌తో ఏ కేసులో కూడా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వికాస్ ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకుంటాడని సమాచారం. యూపీలోని బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో వికాస్‌కు పరిచయాలు ఉన్నాయని అన్నారు. ఏ కేసులో కూడా సాక్ష్యాలు సరిగా లేవని అందుకే శిక్షపడకుండా తప్పించుకున్నాడని అధికారులు చెప్పారు. గతంలోపోలీస్‌స్టేషన్‌లోనే బీజేపీ మంత్రిని వికాస్ హతమార్చినట్లు కేసుల నమోదైందని పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రితో కూడా వికాస్‌కు సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన ఉజ్జయిని వెళ్లి లొంగిపోగలిగాడని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు చెప్పారు.
మార్నింగ్ ఏం జరిగింది
8 మంది పోలీసుల హత్యకేసులో నిందితుడు, 60 కేసులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే చాప్టర్ క్లోజ్ అయింది. శుక్రవారం ఉదయం పోలీసులు ఆయన్ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు తరలిస్తున్న టైంలో పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం ఉజ్జయినీలో పట్టుబడ్డ వికాస్ దుబేను పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో కాన్వాయ్‌లోని ఒక వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా చూసిన దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. లొంగిపోవాలని పోలీసులు చెప్పినా ఖాతరు చేయలేదు. పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయని, తీవ్రంగా గాయపడ్డ వికాస్‌ను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారని ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దుబేకు చెందిన ఐదుగురు అనుచరులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో ఈ కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన వారి సంఖ్య ఆరుకు చేరింది. అంతే కాకుండా చాలా మందిని అరెస్టు చేశారు.
బీజేపీ బండారం బయటికొస్తుందనే..
వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. వికాస్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, వారి గురించి బయట పెడతారనే భయంతోనే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. ‘కారు బోల్తా పడలేదు. కానీ సీక్రెట్లను ఓవర్ టర్న్ చేసి ప్రభుత్వం సురక్షితంగా ఉంది’ అని అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాయి.