Breaking News

హే.. రఘురామా!

హే.. రఘురామా!

సారథి న్యూస్​, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్​లో అధికార పార్టీ వైఎస్సార్​సీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయింది ఏపీలోని యువజన శ్రామిక రైతు పార్టీ పరిస్థితి. ఓ ఎంపీపై వేటు వేసేందుకు వేసిన ప్లాన్‌ బెడిసికొట్టి ఆ పార్టీ గుర్తింపే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ పార్టీ పెద్దలు సీన్‌ రివర్స్‌ అయిందేంటబ్టా! అని తలలు పట్టుకుంటున్నారు. కొంతకాలం నుంచి జగన్‌ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలకు దిగారు. దీంతో అతని ఏం చేయాలో తెలియక పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ధైర్యం చేసి అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి అతడి పదవి కోల్పోయేలా బ్రహ్మాండమైన ఐడియా వేశారు. అయితే, అదే ఐడియా ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ మెడకు చుట్టుకుంది. ‘పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని’ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎంపీ రఘురామకు షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు. పైగా అతడిని ఎంపీ పదవినుంచి తొలగించాలని ఆ పార్టీకి చెందిన ఎంపీలంతా లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విన్నవించారు.

అదే ఇప్పుడు పార్టీ కొంపముంచేలా ఉంది. షోకాజ్‌ నోటీసు అందుకున్న రఘురామ అనేక ప్రశ్నలను లేవనెత్తారు. తాను యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి గెలిచానని, తనకు నోటీసు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌ మీద ఇచ్చారని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు. పైగా అన్న వైఎస్సార్‌ పార్టీ అనేది వేరే పార్టీ అని, వేరే పార్టీ పేరుమీద తనకు నోటీసు ఇచ్చినందున యువజన శ్రామిక రైతు పార్టీ గుర్తింపును రద్దుచేయాలని ఎంపీ ఏకంగా ఎలక్షన్‌ కమిషన్‌కే లేఖ రాశారు. వాస్తవానికి అన్న వైఎస్సార్‌ పార్టీ అనేది వేరే పార్టీ. అయితే, యువజన శ్రామిక రైతు పార్టీని షార్ట్‌కట్‌గా వైఎస్సార్‌ సీపీగా వాడుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇలా వాడుకోవడం తప్పని, ఇది తమ పార్టీకి నష్టం కలిగిస్తోందన్న వైఎస్సార్‌ పార్టీ గతంలోనే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. అయితే, దీనిపై ఎన్నికల కమిషన్‌ ఇక ముందు ఎప్పుడూ ఆ పార్టీ పేరును వాడుకోవద్దని యువజన శ్రామిక రైతు పార్టీ నేతలను ఆదేశించింది.

ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ పేరుతోనే మళ్లీ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో ఎంపీ రఘురామతో పాటు అన్న వైఎస్సార్‌ పార్టీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. నిబంధనలు ఉల్లంఘించిన యువజన శ్రామిక రైతు పార్టీ గుర్తింపును రద్దు చేయాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. దీంతో యువజన శ్రామిక రైతు పార్టీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఎంపీకి గట్టి గుణపాఠం చెబుదామనుకుని తాము చిక్కుల్లో ఇరుక్కున్నామే అని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. విపక్షాలు మాత్రం ఇరికిద్దామనుకుని ఇరుక్కున్నారు భలే భలే అంటూ లోలోపల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాలకపక్ష నేతలు మాత్రం హే.. రఘురామా! ఎంత పని చేశావయ్యా అంటూ నిట్టూరుస్తున్నారు.