Breaking News

హరితవనం.. శభాష్​

హరితవనం.. శభాష్​


సారథి న్యూస్​, వెల్దండ: నాగర్ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ గురువారం శ్రీశైలం– హైదరాబాద్​ హైవేపై ఉన్న వెల్దండ తహసీల్దార్​ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్​ సైదులుతో మాట్లాడారు. ఆఫీసు చుట్టూ పచ్చదనం వెల్లివెరిసేలా నాటించిన మొక్కలను చూసి కలెక్టర్​ ముగ్ధులయ్యారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణ పచ్చదనంతో పరిఢవిల్లడం ఎంతో అభినందనీయమని అభినందించారు. కార్యాలయ ఆవరణలో రాళ్లగుట్టపై ఖాళీగా ఉన్న స్థలంలో పూలతీగ మొక్కలను పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, అందుకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. రైతు వేదిక భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలను త్వరితగతిన ఎంపికచేసి నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.

ముఖ్యంగా శ్మశానవాటికలు, డంపింగ్​ యార్డులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తిచేయాలని కోరారు. ప్రకృతివనాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని, హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్​ సూచించారు. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో విధులు నిర్వహించే వీఆర్ఏకు కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శర్మన్ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్​, ఇతర అధికారులు ఉన్నారు.