సారథి న్యూస్, మెదక్, సిద్దిపేట: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన జర్నలిస్ట్… అణగారిన వర్గాల హక్కుల సాధనకు పోరాడిన ఉద్యమ వీరుడు.. ఎమ్మెల్యేగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి. అనారోగ్యంతో గురువారం మృతి చెందిన రామలింగారెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో 1961 అక్టోబర్ 2 వ తేదీన సోలిపేట రామక్రిష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు అన్నలు రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి… ముగ్గురు అక్కలు లక్ష్మి, విజయలక్ష్మి, సులోచన. మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆధ్వర్యంలో, ప్రస్తుత సీఎం కేసీఆర్ సమక్షంలో 1985లో సుజాతతో సిద్దిపేటలో ఆదర్శ వివాహం జరిగింది. ఆయన కుమార్తె ఉదయ, కుమారుడు సతీష్ రెడ్డి జన్మించారు. చిన్నవయస్సులోనే ప్రజాఉద్యమంలోకి అడుగుపెట్టిన రామలింగారెడ్డి రాడికల్ భావాలు కలిగిన వ్యక్తి. వేలాది మంది విద్యార్థులు, యువకుల గుండెల్లో విప్లవాగ్నిని రగిలించిన గిరాయిపల్లి మృత వీరులు జనార్ధన్, మురళిమోహన్ రెడ్డి, ఆనంద్ రావు, సుధాకర్, నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాటాలతో పాటు మంజీరా రచయితల సంఘం రామలింగారెడ్డి పై బలంగా ముద్రవేసింది.
జర్నలిస్ట్ గా…
సామాజిక దృక్పథం కలిగిన రామలింగారెడ్డి ఉదయం దిన పత్రిక దుబ్బాక విలేకరిగా పాత్రికేయ ప్రస్తానం మొదలు పెట్టారు. ఆ తర్వాత వార్త దినపత్రిక విలేకరిగా దుబ్బాక, సిద్దిపేట, జహీరాబాద్ లో పనిచేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అవలంబిచే ప్రజా వ్యతిరేక విధానాలు, రైతన్నల కష్టాల పై ఎన్నో కథనాలు రాశారు.
టాడా కేసులో జైలు కు
జిల్లాలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో పీపుల్స్ వార్ నక్సలైట్ లకు సహకరిస్తున్నారని ఆరోపణలతో 1998లో ప్రభుత్వం రామలింగారెడ్డి మీద టాడా యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ యాక్ట్ కింద జైలుకెళ్లిన మొట్టమొదటి జర్నలిస్ట్ రామలింగారెడ్డి. విచారణలో అభియోగాలు నిరూపణ కాకపోవడంతో రామలింగారెడ్డి మీద పోలీసులు నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది.
తెలంగాణ ఉద్యమంలో
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో రామలింగ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెన్నంటి నిలిచారు.
తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమ సమయంలోనే రామలింగారెడ్డి 2004 లో టీఆర్ఎస్ లో చేరి దొమ్మాట నియోజక వర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలిచారు. మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రామలింగారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించారు.
సహచరుడిని కోల్పోయాను..
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, జర్నలిస్ట్ లు రామలింగారెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.