ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీల ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా కొత్త అధ్యక్షుడి ఎంపికకోసం మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం కానున్నది.
సీనియర్లపై రాహుల్ ఆగ్రహం
సీడబ్ల్యూసీ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్ తదితర సీనియర్ నేతలు రాసిన బహిరంగ లేఖపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన విషయాన్ని ఎందుకు రచ్చ చేశారని మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ సీనియర్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.