సారథి న్యూస్, శ్రీకాకుళం: మొదటి ఏడాదిలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 90 శాతం వరకు పూర్తి చేశామని, ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే ఆలోచనతో ఈ సదస్సులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ‘మన పాలన, మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా తొలిరోజు ‘ప్రజా పాలన – సంక్షేమం’పై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నుంచి ప్రజలకు ఏమి చేశాం.. ఇంకా ఏమి చేయాలన్న ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ పాలనకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఇంకా మంచిపాలన అందించుటకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చామని, మహిళలు బాగుంటే ఇళ్లు బాగుంటుందని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశామన్నారు. లబ్ధిదారుల జాబితాను సామాజిక ఆడిట్ కోసం సచివాలయంలో ప్రదర్శించామని, ఇంటి గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించ గలుగుతున్నామని పేర్కొన్నారు. కేవలం 4 మాసాల్లోనే 1.38 లక్షల ఉద్యోగాలు కల్పించామని, 2.65 లక్షల వలంటీర్లను నియమించామని పేర్కొన్నారు. బియ్యం కూడా గడప గడపకు చేర్చుతున్నామని, శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పింఛన్లను ఉదయం 5 గంటల సమయానికే అందిస్తున్నామని, రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అందించామన్నారు. 28 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నామని, కరోనా సమయంలో నాలుగు సార్లు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశామని గుర్తుచేశారు. గ్రామంలో ఇంగ్లిషు మీడియం పాఠశాల, వైఎస్సార్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసామన్నారు.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి వైద్యం అందించామని, గ్రామాల్లో 54 రకాల మందులు లభ్యంగా పెడుతున్నామని తెలిపారు. రైతు భరోసా, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, చిన్నారి కంటి చూపు తదితర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. అర్చకులు, ఇమాం, పాస్టర్లకు పారితోషకం అందించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అల్పసంఖ్యాక వర్గాలు, ఇతర లబ్ధిదారులకు రూ.40,139 కోట్లతో పథకాలు అందజేశామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్ జె నివాస్, డీసీఎంఎస్ అధ్యక్షుడూ పిరియా సాయిరాజ్, జేసీలు డాక్టర్ కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జడ్పీ సీఈవో జి.చక్రధరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఏ.కల్యాణ చక్రవర్తి, బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు జి.రాజారావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.కృత్తిక, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు కె.రామారావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, మెప్మా పథక సంచాలకులు ఎం.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.