- జూరాల 11 గేట్లు ఎత్తివేత
- కొనసాగుతున్న వరద ఉధృతి
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పిత్తికి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం జూరాల ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 73,502 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 33,282 క్యూసెక్కులను మొత్తం 1,06,784 క్యూసెక్కులను కిందకు వదిలారు. 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంట వరకు శ్రీశైలం డ్యాంకు 79,425 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీనికితోడు హంద్రీనీవా నుంచి 180 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరింది. డ్యాం సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు 44.3482 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 824.50 అడుగులకు నీరు చేరింది. వారం రోజుల పాటు ఇలాగే వరద కొనసాగితే శ్రీశైలం డ్యాంకు నిండుకుండలా మారనుంది.