Breaking News

శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

  • నందివడ్డెమాన్ లో శనీశ్వర స్వామికి అభిషేకాలు
  • పరమశివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలొచ్చి అభిషేకాలు, విశేష అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నువ్వులనూనె, నల్లటి వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను స్వామి వారికి నివేదన చేస్తారని, స్వామివారి అనుగ్రహం పొందేందుకు కొలుస్తారని ఆలయ ప్రధానార్చకుడు డాక్టర్ గవ్వమటం విశ్వనాథశాస్త్రి తెలిపారు. ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు, ఆరోగ్యం, శత్రు బాధ నివారణకు శనీశ్వరస్వామి వారిని కొలవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులను పూజించాలని, మూగజీవాలకు ఆహారం అందించాలని, కాకులకు బెల్లంతో తయారుచేసిన రొట్టెలను ముక్కలుగా చేసి ఆహారంగా అందించాలని వివరించారు. మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థాన ఉత్తరం వైపున ఇక్కడ వెలసిన శనీశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, తహసీల్దార్ అంజిరెడ్డి దంపతులతో పరమశివుడికి రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందీశ్వర స్వామి వారికి మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో శనీశ్వర స్వామి ఆలయ అర్చకుడు గవ్వమటం శాంతికుమార్, ఉమ్మయ్య, శివసాయి సృజన్, విశ్వఆరాధ్య, మల్లికార్జున్, ఆలయం ధర్మకర్త గోపాల్ రావు, కమిటీసభ్యులు ప్రభాకరచారి, వీరశేఖరాచారి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.