Breaking News

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలే

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలే

  • ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం
  • కూలీల సంక్షోభం పోవాలి.. యాంత్రీకరణ పెరగాలి
  • నాబార్డ్ చైర్మన్, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కోరారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు బృందంతో సీఎం సమావేశమయ్యారు. ‘దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే. దేశం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది.’ అని సీఎం కేసీఆర్​ అన్నారు ‘పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను వ్యవసాయమే అందిస్తోంది. పారిశ్రామికీకరణ కూడా జరగాలి. కాబట్టి భారతదేశంలో వ్యవసాధారిత పరిశ్రమలు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. రైతులు సంఘటిత వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే విధంగా ప్రోత్సహించాలి’ అని సూచించారు.

నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులును సత్కరిస్తున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు

ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లను ప్రోత్సహించాలి
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను పెట్టాలని నిర్ణయించిందని, ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి అవసరమైన ఆర్థిక చేయూత అందించే పథకాలు, కార్యక్రమాలకు నాబార్డు రూపకల్పన చేయాలని సూచించారు. కూలీల కొరత సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలన్నారు. డీసీసీబీలు మరింత సమర్థవంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, నర్సింగ్ రావు, రామకృష్ణ, సందీప్ సుల్తానియా, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.