సారథి న్యూస్, వరంగల్ : నిత్యం భక్తులతో రద్దీగా ఉండే హన్మకొండ వేయిస్థంభాల గుడిలోకి.. సాయంత్రం 4గంటల సమయంలో కొంత మంది ముష్కరులు ప్రవేశించారు. ముష్కరులు ఆలయంలో డిటోనేటర్లు, బాంబులను అమర్చారు. కొందరు భక్తులను, ఆలయ సిబ్బందిని ముష్కరులు బంధించారు. దీన్ని సీసీ కెమెరాల్లో గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించింది. వరంగల్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఆక్టోపస్ కమోండోలు రంగంలోకి దిగారు. చేతిలో ఆధునిక ఆయుధాలు, మాస్కులు ధరించిన ఆక్టోపస్ కమోండోలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆలయంలో ప్రవేశించి చాకచక్యంతో ముష్కరుల చేతుల్లో బందీలుగా ఉన్న భక్తులను, ఆలయ సిబ్బందిని ఆక్టోపస్ కమోండోలు సురక్షితంగా విడిపించడంతో పాటు బాంబులను నిర్వీర్యం చేసి ముష్కరులను అంతమొందించారు. ఇదంతా చూస్తున్న ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. కానీ ఇది నిజంకాదు..
కానీ నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుంది ఉగ్రదాడులను ఎలా ఎదుర్కొవాలని తెలిసేలా ఆక్టోపస్ విభాగం అధికారి అనంతయ్య నేతృత్వంలో సుమారు 40మంది ఆక్టోపస్ కమాండో బృందం వరంగల్ కమిషనరేట్ పోలీసులతో కలిసి శుక్రవారం వెయ్యి స్థంబాల గుడిలో మాక్ డ్రిల్ నిర్వహించింది. గతంలో దేశంలోని ప్రధాన నగరాలపై ముష్కరులు ఉగ్రదాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఒక వేళ ఉగ్రవాదులు చిన్న నగరాలపై దాడులకు పాల్పడితే ఎలా అదుపు చేయాలనే ఉద్దేశంతో జనాల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వరంగల్ అదనపు డీసీపీ గిరిధర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ నగేశ్, హన్మకొండ ఇన్స్పెక్టర్ దయాకర్ పాల్గొన్నారు.