వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్‌లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న విదేశీ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయితే దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదా కాలేజీ మార్చుకోవాలని సూచించింది. అలా లేని పక్షంలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. 2018–19 అకడమిక్ ఇయర్‌కు గాను అమెరికాలో దాదాపు 10లక్షల మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నారు. వీరిలో చాలా వరకు ఇండియా, చైనా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, కెనడా నుంచి వెళ్లినవాళ్లే ఎక్కువ. కాగా.. ఇప్పటికీ కొన్ని యూనివర్సిటీలు కొత్త సెమిస్టర్‌కు సంబంధించి గైడ్‌లైన్స్ జారీ చేయలేదు. హార్వార్డ్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలు ఆన్‌లైన్ క్లాసులకే మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనేది తేలాల్సి ఉంది.