Breaking News

వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

సారథి న్యూస్, హుస్నాబాద్: వాగు నీటిలో కొట్టుకుపోయిన లారీడ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. చివరికి ఆచూకీ లభించకపోడంతో వెనుదిరిగాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారుజామున వరంగల్లు వైపునకు లారీ(టీఎస్ 02 యూబీ 1,836) వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముదిమడక శంకర్(37) ఎప్పటిలాగే వెళ్లేందుకు ప్రయత్నించగా లారీ ఒక్కసారిగా వాగులో కొట్టుకుపోయింది. నీటిలో కొద్దిదూరం కొట్టుకుపోయిన తర్వాత లారీక్లీనర్ కె.ధర్మయ్య సురక్షితంగా బయటపడగా డ్రైవర్ శంకర్ గల్లంతయ్యాడు. ధర్మయ్య వెంటనే గ్రామస్తులను ఆశ్రయించగా వారు పోలీసులకు సమాచారం అందించారు.

వరద ప్రవాహం పెరుగుతుండడంతో మంత్రి హరీశ్​రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీంను రప్పించారు. ముళ్లపొదల్లో చిక్కిన లారీ డ్రైవర్ కు తాళ్లు, జాకెట్ అందించారు. నీటి ప్రవాహ ఉధృతి పెరగడం, ఆయనకు జాకెట్ ను సక్రమంగా వేసుకోరాకపోవడంతో రెస్క్యూ టీం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మధ్యాహ్నం హెలిక్యాప్టర్ ను బస్వాపూర్ కు పంపించారు. అప్పటివరకు డ్రైవర్ పూర్తిగా నీటిలోనే ఉండడంతో హెలిక్యాప్టర్ వచ్చే కొద్దిక్షణాల ముందే డ్రైవర్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు రెస్క్యూటీం అధికారులు తెలిపారు. లారీడ్రైవర్ కోసం రాత్రి పొద్దుపోయే దాకా గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేశామని, ఆదివారం ఉదయం ప్రారంభిస్తామని ఏసీపీ మహేందర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్ తెలిపారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు