Breaking News

వలపువల.. బుట్టలోపడ్డారో ఇక​అంతే..

ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్​మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్​మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో డబ్బు గుంజుతుంది. ఈ కిలాడి యువతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్​ చేశారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నది. సదరు యువతి పాల్వంచ పట్టణంలో ఆర్ధికంగా స్ధిరపడిన వ్యక్తులను టార్గెట్​ చేస్తున్నది. కాగా ఇటీవల పాల్వంచ లోని శాస్త్రి రోడ్డుకు చెందిన ప్రముఖ వ్యాపారిని ఈ యువతి ట్రాప్ చేసింది. అనంతరం అతడితో గడిపింది. ఆ సమయంలో వీడియోలు తీసింది. అనంతరం ఈ విషయాన్ని వ్యాపారికి చెప్పి బెదిరించటం మొదలెట్టింది. తనకు రూ. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని… లేకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో ఈ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు డబ్బిస్తామంటూ సదరు యువతిని రప్పించి అరెస్ట్ చేశారు.