ఆల్మట్టి రిజర్వాయర్(ఫైల్)
- కృష్ణానదిపై రిజర్వాయర్లను ఖాళీచేయండి
- నదిలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం
- జూరాల, రెండు రోజుల్లో శ్రీశైలానికి..
- అదే స్థాయిలో ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి
- ముందే హెచ్చరించిన కేంద్ర జలసంఘం
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో కొంత నీటిని దిగువకు వదిలేసి ఖాళీ ఉంచుకోవాలని సూచించింది. తూర్పు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో పిల్లకాల్వలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఆ నీరంతా నదిలోకి వస్తోందని వెల్లడించింది. కాగా, మరో రెండు రోజుల్లో కృష్ణమ్మ, తుంగభద్ర వరద నీటితో శ్రీశైలం జలాశయం 75 శాతం వరకు నిండిపోయేంత వరద రావచ్చని అంచనా వేశారు. కృష్ణానదీ తీరప్రాంతాల ప్రజలకు ఉన్నతాధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
పెరుగున్న వరద
కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం నాలుగు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. నారాయణపూర్ డ్యాం వద్ద 3.80లక్షల క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు కొన్నిగంటల్లో 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరనుంది. మరోవైపు తుంగభద్ర నీరు సుంకేసుల డ్యామ్ కు చేరుతుందని అధికారులు వెల్లడించారు. నదీతీరం, లోతట్టు ప్రాంత ప్రజలు ప్రమత్తంగా ఉండాలని సూచించారు.